)
Gaza Conflict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు తెలిపారు. పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు మొత్తం పశ్చిమాసియా ప్రాంతానికి ఇది శాశ్వత శాంతి, భద్రత, అభివృద్ధి తీసుకువచ్చే నిర్మాణాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు. ట్రంప్ ప్రణాళిక ప్రకటించిన తర్వాత మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.. ఈ సమగ్ర ప్రణాళిక రెండు పక్షాలకూ దీర్ఘకాలిక శాంతిని అందించే మార్గం అవుతుంది. అన్ని పక్షాలు కలిసి ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నాము అని తెలిపారు.
సెప్టెంబర్ 29న ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రణాళికను ప్రకటించారు. అయితే హమాస్ అంగీకరిస్తుందా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఈ ప్రతిపాదనలో 20 పాయింట్లు ఉన్నాయి. అందులో గాజాను తీవ్రవాద రహిత జోన్‌గా మలచడం, పునరాభివృద్ధి చేయడం, అలాగే తాత్కాలిక పాలక బోర్డు ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. ఈ బోర్డుకు ట్రంప్ అధ్యక్షత వహించనున్నారు. బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు.
ప్రణాళిక ప్రకారం రెండు పక్షాలు అంగీకరించినట్లయితే యుద్ధం వెంటనే ముగుస్తుంది. ఇజ్రాయెల్ దళాలు నిర్ణీత రేఖలకు వెనక్కి వెళతాయి. ఈ సమయంలో వైమానిక దాడులు, ఫిరంగి దాడులు నిలిపిచిపోతాయి. యుద్ధాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోతాయి. అత్యంత ప్రాధాన్యం బందీల విడుదలకు ఇచ్చింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని అంగీకరించిన 72 గంటల్లోపు అన్ని బందీలను (సజీవం లేదా మరణించిన వారు) తిరిగి ఇవ్వాలి. తరువాత ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలు, అక్టోబర్ 7, 2023 తరువాత నిర్బంధించిన 1700 మంది గాజా వాసులను విడుదల చేస్తుంది. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. అలాగే ప్రతి ఇజ్రాయెల్ బందీ అవశేషాలకు ప్రతిగా 15 మంది గాజా వాసుల మృతదేహాలను విడుదల చేస్తారు.
ఈ ప్రణాళిక అమలు అయినట్లయితే గాజాలో శాంతి స్థిరపడే అవకాశం ఉంది. రెండు జాతుల మధ్య శత్రుత్వం కొంత మేరు తగ్గుతుంది. ప్రాంతీయ అభివృద్ధి, భద్రతకు ఇది కొత్త అవకాశాలను తెస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా శాంతి చర్చలకు ఇది ఒక ముఖ్యమైన మలుపు కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ ప్రతిపాదనకు మోదీ మద్దతు తెలిపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook