)
Reliance ADA Group: రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (Reliance ADA Group) పై రూ. 28,874 కోట్ల బ్యాంకింగ్ మోసం జరిగిందని వార్తా సంస్థ కోబ్రాపోస్ట్ చేసిన ఆరోపణలను ADA కంపెనీ తీవ్రంగా ఖండించింది. కోబ్రాపోస్ట్ చేసిన ఈ నివేదికను దుర్మార్గపు, అసత్య, ఎజెండా ఆధారిత ప్రచారంగా పేర్కొంది. ఇది రిలయన్స్ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశించిన కుట్ర అని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కోబ్రాపోస్ట్ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ 2019 నుండి నిర్వీర్యంగా ఉండి.. ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ ఆస్తులను కొనుగోలు చేయడంలో వ్యాపార ప్రయోజనం కలిగిన సంస్థల మద్దతుతో తిరిగి యాక్టివ్ అయ్యిందంటూ పేర్కొంది.
రిలయన్స్ గ్రూప్ ప్రకారం.. కోబ్రాపోస్ట్ ప్రస్తావించిన కథనంలో కొత్త విషయాలు అంటూ ఏవీ లేవు. అవి పాత.. ఇప్పటికే ప్రజా డొమైన్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే వక్రీకరించిందని కంపెనీ చెప్పింది. ఈ అంశాలను ఇప్పటికే CBI, ED, SEBI వంటి చట్టపరమైన సంస్థలు పరిశీలించాయని.. వాటిలో కొన్ని ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అందువల్ల, కోర్టు తీర్పు వెలువడకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా సరైనది కాదని రిలయన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
కోబ్రాపోస్ట్ వ్యవస్థాపకుడు అనిరుద్ధ బహల్, అతనికి సంబంధించిన వ్యక్తులు ప్రొఫెషనల్ జర్నలిజం(Professional journalism) పేరుతో గ్రూప్‌పై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారని..ఇది బ్లాక్మెయిల్, గ్రీన్మెయిల్ వ్యూహాలకు ఉదాహరణ అని పేర్కొంది. కోబ్రాపోస్ట్కు చెందిన కొందరు వ్యక్తులు కంపెనీ ప్రతినిధులను సంప్రదించి.. సమస్యను పరిష్కరించవచ్చు అంటూ బెదిరింపులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది చట్టవిరుద్ధమని, వాటాదారుల ప్రయోజనాలను రక్షించడానికి కంపెనీ అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
రిలయన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కంపెనీ షేర్ ధరలను తగ్గించి.. ప్రత్యర్థులు తక్కువ ధరలకు విలువైన ఆస్తులను కొనుగోలు చేయడమే అని పేర్కొంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ షేర్ల ధరలు గణనీయంగా పడిపోవడం వెనుక కూడా ఇలాంటి కుట్రే ఉందని పేర్కొంది. కంపెనీ విలువైన ఆస్తుల్లో ఢిల్లీలోని విద్యుత్ సరఫరా సంస్థ BSES Ltd, ముంబై మౌలిక సదుపాయాల ప్రధాన భాగమైన ముంబై మెట్రో, అలాగే 25 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో నడుస్తున్న రోసా పవర్ ప్రాజెక్ట్ (1200 MW) ఉన్నాయి.
గత మూడు నెలల్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15,000 కోట్లకు పైగా తగ్గిందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గుదల పుకార్లు, ఫేక్ ప్రచారం, ఊహాజనిత వ్యాపారం వలన జరిగిందని కంపెనీ అభిప్రాయపడింది. కోబ్రాపోస్ట్ సంస్థ విశ్వసనీయత, నిధుల మూలం, ఉద్దేశ్యం గురించి సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.
రిలయన్స్ ADA గ్రూప్ ప్రకారం, కోబ్రాపోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా వీక్ గా ఉండి.. విశ్వసనీయత కోల్పోయిన సంస్థ అని తెలిపింది. ఇప్పుడు వారు జరపబోతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది రిలయన్స్, అనిల్ అంబానీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఉద్దేశించినదని కంపెనీ పేర్కొంది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా, కొనసాగుతున్న దర్యాప్తులను ప్రభావితం చేయాలనే ప్రయత్నమని కూడా రిలయన్స్ తెలిపింది.
గత త్రైమాసికంలో షేర్ మార్కెట్లో వచ్చిన అస్థిరత ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు కంపెనీ SEBIకి ఫిర్యాదు చేసింది. మార్కెట్ సమగ్రతను దెబ్బతీసే చర్యలపై విచారణ జరపాలని కోరింది. రిలయన్స్ ADA గ్రూప్ పెట్టుబడిదారులను, మీడియాను ధృవీకరించని వార్తలకంటే ఆడిట్ చేసిన నివేదికలు, అధికారిక దాఖలాలపై మాత్రమే ఆధారపడాలి అని సూచించింది. మొత్తానికి, రిలయన్స్ గ్రూప్ ప్రకారం, కోబ్రాపోస్ట్ చేసిన ఆరోపణలు అసత్యం, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవంటూ పేర్కొంది. వాటి వెనుక వ్యాపార ప్రయోజనం ఉన్న సంస్థల కుట్ర ఉన్నదని కంపెనీ తెలిపింది. ఈ ప్రచారం పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, మార్కెట్‌ను కూడా అస్థిరపరచడమే లక్ష్యమని రిలయన్స్ ఖండించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.