)
IAS Success Story: కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు.. కష్టపడి ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఏమీ లేదు. తాజాగా విడుదలైన యూపీఎస్సీ 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ ర్యాంకర్ గా నిలిచిన సాయి శివాని విజయ గాధ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని వరంగల్ నగరంలో నివాసం ఉంటున్నారు.
22 సంవత్సరాల సాయి శివాని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 11వ ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల టాపర్‌గా గుర్తింపు పొంది, ఆమె తన సత్తా చాటారు. చిన్న వయసులోనే సివిల్స్ క్లియర్ చేసిన సాయి శివాని రెండో ప్రయత్నంలోనే యూపీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించారు. మొదటి ప్రయత్నంలో ఆమె ప్రిలిమ్స్ 5 మార్కులతో మిస్ అయ్యింది, ఇక రెండవ ప్రయత్నంలో మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూకు వెళ్లి ర్యాంక్ సాధించడం విశేషం.
ఆమె చిన్ననాటి లక్ష్యం కలెక్టర్ కావడం కనుక ఈ విజయంతో ఆమె కలకు బలం చేకూరేలా కష్ట పడింది. ఆమె తన సక్సెస్ స్టోరీని పంచుకుంటూ అనేక విషయాలు తెలిపారు. ముఖ్యంగా నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో ఆమె ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా, అలాగే సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా కేవలం తన లక్ష్యాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని కృషి చేశానని తన విజయ రహస్యాన్ని పేర్కొన్నారు. అలాగే ఒత్తిడిని జయించేందుకు తాను భగవద్గీతను చదవడంతో పాటు యోగా అభ్యాసం చేసినట్లు తెలిపారు.
అయితే సాయి శివాని ఇటీవల నిర్వహించిన తెలంగాణ గ్రూప్-1 పరీక్షలో జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించడం విశేషం. ఇప్పటికే ఆమె గ్రూప్-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్పీ ఉద్యోగానికి అర్హత పొందడం విశేషం అని చెప్పవచ్చు.
ఇక ఆమె కుటుంబ నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే తండ్రి రాజు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, తల్లి రజిత ఒక సాధారణ గృహిణి. ఆమె సోదరి సరయూ సఖి హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తున్నారు. ఆమె తమ్ముడు సాయి శివ, హైదరాబాదులోని బాచుపల్లిలో బీటెక్ చదువుతున్నారు.
ఇక సాయి శివాని విద్యాభ్యాసం విషయానికి వచ్చినట్లయితే ఆమె 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో చదివారు. ఇంటర్, బీటెక్ కోర్సులు కలిపి 6 సంవత్సరాలు వైఎస్సార్ కడప జిల్లా, ఇడుపులపాయ ఐఐఐటీ క్యాంపస్‌లో పూర్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook