Hindu Adoptions and Maintenance Act: సుప్రీంకోర్టు తాజాగా వితంతువుల హక్కులను మరింత బలోపేతం ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. హిందూ దత్తత, నిర్వహణ చట్టం, 1956 ప్రకారం, ఒక మహిళ తన భర్త మరణించిన తర్వాత వితంతువుగా మారినప్పటికీ.. ఆమె మామగారి ఆస్తి నుండి భరణం పొందే హక్కు కలిగి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భర్త మరణం మామగారి మరణానికి ముందు జరిగిందా? తర్వాత జరిగిందా? అనే అంశం ఆధారంగా వితంతువు హక్కులను నిరాకరించలేమని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ తీర్పుకు కారణమైన కేసు దివంగత డాక్టర్ ప్రసాద్ ఆస్తికి సంబంధించినది. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు రంజీత్ శర్మ మార్చి 2, 2023న మరణించారు. రంజీత్ శర్మ భార్య గీతా శర్మ, తన భర్త మరణించిన అనంతరం మామగారి ఆస్తి నుంచి భరణం ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే కుటుంబం తరఫున వాదన ఏమిటంటే, డాక్టర్ ప్రసాద్ 2011లోనే తన ఆస్తిని మరో కుమారుడు దేవిందర్ రాయ్ భార్య కాంచన రాయ్, వారి పిల్లలకు వారసత్వంగా ఇస్తూ వీలునామా రాశారని, అందులో రంజీత్ శర్మను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గీతా శర్మ దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. డాక్టర్ ప్రసాద్ మరణించిన సమయంలో గీతా శర్మ వితంతువు కాదనే కారణంతో ఆమె అభ్యర్థనను కొట్టివేసింది. దీనిపై గీతా శర్మ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, గీతా శర్మ చట్టపరంగా ఆధారపడిన వ్యక్తేనని పేర్కొంది. భరణం అంశాన్ని మళ్లీ పరిశీలించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
ఈ నిర్ణయాన్ని కాంచన రాయ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. గీతా శర్మ తన మామగారి మరణ సమయంలో వితంతువు కాదని, అందువల్ల ఆమెకు భరణం హక్కు ఉండదని వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 21(vii) ప్రకారం, కుమారుడి ఏ వితంతువైనా కుటుంబంపై ఆధారపడిన వ్యక్తిగా పరిగణిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. భర్త మరణం మామగారి మరణానికి ముందే జరగాలి అనే షరతు చట్టంలో ఎక్కడా లేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉటంకిస్తూ, భర్త మరణించిన కాలాన్ని ఆధారంగా చేసుకుని వితంతువుల మధ్య వివక్ష చూపడం సమానత్వ హక్కుకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. భరణం నిరాకరించడం మహిళ గౌరవంగా జీవించే హక్కును హరించడమేనని పేర్కొంది. ఇలాంటి విధానం వితంతువులను పేదరికం, సామాజిక ఒంటరితనంలోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మనుస్మృతిని ప్రస్తావిస్తూ, కుటుంబ పెద్ద తనపై ఆధారపడిన మహిళలను పోషించడం నైతికంగానూ, చట్టపరంగానూ బాధ్యతేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మామగారు మరణించిన తర్వాత కూడా ఆయన వారసులు, ఆయనపై ఆధారపడిన వారికి సహాయం అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ, అన్ని అప్పీల్స్‌ను తిరస్కరించింది. గీతా శర్మకు ఇవ్వాల్సిన భరణం మొత్తాన్ని ఆమె అర్హతలు, పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. వితంతువుల హక్కుల పరిరక్షణలో ఈ తీర్పు ఒక చారిత్రాత్మక ముందడుగుగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









