IPOs: దలాల్ స్ట్రీట్లో ఐపీఓల సందడి తగ్గింది. ఒక్కప్పుడు వారానికి సగటున ఐదారు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల రూపంలో సందడి చేశాయి. కానీ ఇప్పుడా ఉత్సాహం తగ్గిపోయింది. ఫిబ్రవరి 14న ఐపీఓకు వచ్చిన క్వాలిటీ పవర్ తర్వాత గడిచిన మూడు వారాలుగా మెయిన్ బోర్డ్ నుంచి ఒక్కటి అంటే ఒక్క కంపెనీ కూడా ఐపీఓ రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. స్టాక్ మార్కెట్ వరుస నష్టాలు, వాణిజ్య యుద్ధ భయాలు దీనికి కారణమని తెలుస్తోంది.
గత ఏడాది డిసెంబర్ లో మెయిర్ బోర్డ్ నుంచి ఐపీఓకు వచ్చిన కంపెనీల సంఖ్య 16. ఈ ఏడాది జనవరి నాటికి ఆ సంఖ్య 5గా నమోదు అయ్యింది. ఇక ఫిబ్రవరిలో నాలుగుకి పడిపోయింది. గత ఏడాది మొత్తం 91 కంపెనీలు మార్కెట్ నుంచి ఏకంగా రూ. 1.6లక్షల కోట్లు సేకరించాయి. బలమైన రిటైల్ భాగస్వామ్యం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఇందుకు కారణమని చెప్పవచ్చు. అయితే గత రెండు నెలల నుంచి ఐపీఓల ఎంట్రీ తగ్గుముఖం పట్టింది. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కారణంగా పెట్టుబడిదారులు కొత్త లిస్టింగ్ లపై ఆసక్తి తగ్గిపోతోంది. ప్రస్తుతం ఉన్న పోర్ట్ పోలియోను మెరుగుపరచుకోవడంపై మదుపర్లు ఫోకస్ సారిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం సెబీ నుంచి ఆమోదం లభించిన 45 కంపెనీలు మార్కెట్ నుంచి రూ. 67,000కోట్లకుపైగా నిధులను సమీకరించాలని చూస్తున్నాయి. అయితే ఆయా కంపెనీలేవీ తమ ఐపీఓ ప్రణాళికలను ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం. మరో 69 కంపెనీలు సెబీ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ఈ కంపెనీలు మొత్తం రూ. 1.15లక్షల కోట్లపైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలియదు.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లను వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు మదుపర్లలో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. దీనికితోడు దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులు క్రమంగా వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా పెద్దెత్తున పెట్టుబడులు తరలిపోతుండటంతో మన మార్కెట్ పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రిటైల్ పెట్టుబడిదారులకు ఐపీఓలకు ఆసక్తి తగ్గుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో మార్కెట్లు కాస్త కోలుకున్నాక ఐపీఓకు రావడం మంచిందని పలుకంపెనీలు భావిస్తున్నాయి. ఈ కారణంగా ఐపీఓ బూమ్ తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









