)
Trump Tariffs on Medicines: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈసారి ట్రంప్ చూపు ఔషధ రంగంపై పడింది. అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై భారీ సుంకాలు విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ సుంకాలు 200 శాతం వరకు పెరగవచ్చని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అంటే, రాబోయే రోజుల్లో అమెరికాలో మందుల ధరలు సాధారణ ప్రజలకు అందని స్థాయికి చేరే ప్రమాదం ఉంది.
నిర్ణయానికి కారణం?
ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని జాతీయ భద్రత పేరుతో 1962 వాణిజ్య విస్తరణ చట్టం (Section 232) కింద తీసుకురావాలని భావిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మందుల కొరతను గుర్తు చేస్తూ, దేశీయ ఉత్పత్తి పెంపు అవసరమని వాదన వినిపిస్తోంది. గతంలోనే ఆటోమొబైల్, ఉక్కు వంటి రంగాలపై సుంకాలు పెంచిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఔషధ రంగాన్నీ అదే దారిలో నడిపే ప్రయత్నం చేస్తోంది.
ఎప్పటి నుంచి అమలు?
ఔషధాలపై సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. ఔషధ సంస్థలకు సర్దుబాటు అయ్యేందుకు ఒకటిన్నర సంవత్సరాల వరకు గడువు ఇవ్వనున్నట్లు వైట్ హౌస్ సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే చాలా కంపెనీలు 6 నుంచి 18 నెలల వరకు సరిపడా స్టాక్ నిల్వ చేసుకున్నాయి. కాబట్టి, ఈ కొత్త సుంకాల అసలు ప్రభావం 2026 చివరి నుంచి 2028 వరకు స్పష్టంగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ధరల పెరుగుదల, ప్రజలపై ప్రభావం
నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం, 25 శాతం సుంకం విధించినా కూడా ఔషధ ధరలు 10 నుంచి 14 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఫలితంగా, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు, వృద్ధులు ఎక్కువ ఇబ్బందులు పడతారని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. సరఫరా గొలుసులు దెబ్బతినే అవకాశం ఉండటంతో కొంతకాలం మందుల కొరతలు కూడా తలెత్తవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఏ ఔషధాలపై ప్రభావం?
అమెరికాలో 92శాతం ఔషధాలు జనరిక్ కేటగిరీలో ఉన్నాయి. వీటిని తక్కువ లాభాలతో ఉత్పత్తి చేస్తారు. కాబట్టి భారీ సుంకాలను తట్టుకోలేక కొన్ని కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి వైదొలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ వంటి ఔషధాల్లో 97శాతం నుండి 92శాతం వరకు కీలక పదార్థాలు విదేశాల నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ సుంకాలు అమల్లోకి వస్తే ప్రభావం మరింత తీవ్రమవుతుంది.
భారత్‌పై ప్రభావం:
భారతదేశం అమెరికాకు జనరిక్ ఔషధాలు, క్రియాశీల పదార్థాల ప్రధాన సరఫరాదారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సమాచారం ప్రకారం, భారత్‌ను తాత్కాలికంగా సుంకాల నుంచి మినహాయించారు. ఎందుకంటే అమెరికా ఆరోగ్య సంరక్షణలో జనరిక్ మందులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ, అమెరికా మార్కెట్లో పరిస్థితులు మారితే భారత ఔషధ రంగంపైనా ప్రభావం పడే అవకాశముంది.
చట్టపరమైన సవాళ్లు:
ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, చట్టపరంగా కూడా వివాదాస్పదమైంది. అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఇప్పటికే ఇలాంటి సుంకాలను కొంతవరకు తిరస్కరించింది. ఇటువంటి నిర్ణయాలకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అని తీర్పు ఇచ్చింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ఎన్నికల దిశలో చర్చనీయాంశం అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.