Union Budget 2026: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ నిర్మలమ్మ వరుసగా ప్రవేశపెడుతున్న 9వ బడ్జెట్ కావడం విశేషం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పన్ను చెల్లింపుదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపు, పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, అలాగే పాత పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపులు పెంచుతారేమో అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను విధానాన్ని గమనిస్తే, పాత పన్ను వ్యవస్థకు పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపించడం లేదు.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం పాత పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేయకుండా, పన్ను చెల్లింపుదారులను క్రమంగా కొత్త పన్ను విధానం వైపు మళ్లిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే 80 శాతం కంటే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు కొత్త వ్యవస్థను ఎంచుకున్నారు. అయినప్పటికీ, ఇంకా పాత విధానంలో కొనసాగుతున్న జీతభత్యాలు పొందే ఉద్యోగులు కొంత ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత ఆరు బడ్జెట్లను పరిశీలిస్తే, తక్కువ మినహాయింపులు, తక్కువ సంక్లిష్టతతో కూడిన సరళమైన పన్ను నిర్మాణాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, 2026–27 బడ్జెట్‌లో పాత పన్ను విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది బడ్జెట్‌లో మాత్రం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. అలాగే సెక్షన్ 87A కింద ఇచ్చే పన్ను రాయితీని రూ.25,000 నుంచి రూ.60,000కు పెంచడంతో, కొత్త విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మారింది. జీతం పొందే ఉద్యోగులకు ఇచ్చే ప్రామాణిక మినహాయింపును కూడా రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచడం జరిగింది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానం ఇప్పటికే గణనీయంగా లాభదాయకంగా మారిన నేపథ్యంలో, ఈసారి మళ్లీ పెద్ద ఎత్తున శ్లాబ్‌ల పునర్నిర్మాణం జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
పన్ను శ్లాబ్‌లపై పెద్ద మార్పులు ఆశించవద్దని పన్ను నిపుణులు కూడా సూచిస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ సురేష్ సురానా మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లోనే వ్యక్తిగత ఆదాయపు పన్ను వ్యవస్థలో విస్తృతమైన మార్పులు చేసిన నేపథ్యంలో, 2026–27 బడ్జెట్‌లో మరోసారి భారీ సవరణలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆదాయపు పన్ను చట్టం–2025 ఏప్రిల్ 1, 2026 నుంచి పూర్తిగా అమల్లోకి రానున్న నేపథ్యంలో, ఈసారి బడ్జెట్‌లో స్థిరత్వం, విధానపరమైన కొనసాగింపు, స్పష్టతపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు దశల్లో జనవరి 28 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే తుది దశ సన్నాహాల్లో ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో నిర్మలా సీతారామన్ సమర్పించనున్న తొమ్మిదవ బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Union Budget 2026: రైతులకు కేంద్రం తీపికబురు.. ఈ సారి బడ్జెట్‌లో ఎవరూ ఊహించని గిఫ్ట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









