ఒక సినిమాను సమీక్షించడం.. దానికి తమ అభిప్రాయాలను జోడించి ప్రేక్షకులందరూ చిత్రాన్ని చూడకముందే హిట్టా.. ఫట్టా అని నిర్థారించడం ఎంత వరకు సబబు! అసలు సబబే కాదంటున్నారు కొందరు సినీ ప్రముఖులు.

 

ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తే.. అది పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చేరకముందే పత్రికల్లో, టివిల్లో, వెబ్ సైట్లలో దాని ఫలితాన్ని రివ్యూల ద్వారా  నిర్ణయించడం వల్ల.. ఆ సినిమా విజయాపజయాలకు సమీక్షకులే పరోక్ష కారణమవుతున్నారన్నది వారి వాదన. అయితే నాణ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాలని, అసలు సరైన కథ గానీ, వినోదం గానీ అందించకుండా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ, వారిచ్చే డబ్బులకు న్యాయం చేయలేని సినిమాలు ఎన్నో వస్తున్నాయని.. అలాంటివాటి బారి నుండి ప్రేక్షకులను అప్రమత్తం చేయడానికే సినిమా రివ్యూలని వాదించేవారు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇదే విషయంపై స్పందిస్తూ "జై లవకుశ" సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షనులో నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. 

 

"ఒక పేషెంట్ ఐసీయూలో  ట్రీట్‌మెంట్ పొందుతున్నప్పుడు, అతని  ఆరోగ్యం మీద కేవలం అనుభవం ఉన్న డాక్టర్లకు మాత్రమే స్పందించే హక్కు ఉంటుందని.. అలా కాకుండా దాని మీద మాట్లాడే నైతిక హక్కు ఇంకెవరికీ ఉండదని.. కొందరు దారినపోయే దానయ్యలు అన్నీ తెలిసినట్టే ఆ ట్రీట్ మెంట్ మీద స్పందించడం, నెగటివ్‌గా మాట్లాడడం ఎంత తప్పో..  సినిమా మీద సమీక్షకులు స్పందించడం కూడా అంతే తప్పు అని ఆయన తెలిపారు.  అలాగే ఒక సినిమా మీద స్పందించే హక్కు ప్రేక్షకులకే ఉంటుందని..వారే ఇక్కడ డాక్టర్లతో సమానమని"  పేర్కొన్నారు. అసలు సినిమా మీద అవగాహన లేకుండా రివ్యూలు రాయడం వల్ల, ప్రేక్షకులు అయోమయంలో పడతారని, ఆ విషయం ఆయా రివ్యూలు రాసేవారి విజ్ఞతకే  వదిలేస్తున్నానని తెలియజేశారు. రివ్యూ రైటర్లను ఎమర్జన్సీ వార్డులోనే సినిమాను చంపేస్తున్నదారిన పోయే దానయ్యలుగా పేర్కొన్నారు. అయినా ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ అన్ని విషయాల మీద స్పందించే హక్కు ఉందని, అయితే ఆ స్పందన నిజాయతీగా ఉండాలని ఆయన అభిప్రాయ పడ్డారు. 

 

తాజాగా ఇదే విషయంపై మరో ప్రముఖ నటుడు మంచు విష్ణు స్పందిస్తూ.. సమీక్షకులు సరైన రివ్యూలు ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. కొందరు సమీక్షకులు సినిమా చూస్తుండగానే లైవ్ అప్ డేట్స్ పేరుతో రివ్యూలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఏకాగ్రతతో సినిమా చూడకుండా రివ్యూ రాయడం వల్ల.. మంచి రివ్యూ ఎలా వస్తుంది అన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు.  జైలవకుశ సినిమా విడుదలయ్యాక కూడా తొలుత కొన్ని వెబ్ సైట్స్‌లో బిలో యావరేజ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సమీక్షకుల అభిప్రాయాలతో చాలా మంది ఏకీభవించని పరిస్థితి కూడా తలెత్తింది. ఇదే విషయం మీద సోషల్ మీడియాలో  వార్ కూడా మొదలైంది. కొంతమంది హీరోలను బట్టి, ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను బట్టి రివ్యూలు ఇస్తుంటారని కూడా అభిప్రాయపడ్డారు. 

 

ఇదే రివ్యూల అంశంపై టాలీవుడ్ నటుడు మహేష్ బాబు స్పందిస్తూ.. తను కూడా రివ్యూలు చదువుతాడని.. సినిమా బాగుంటే బాగుందనే రాస్తున్నారని.. లేకపోతే బాగాలేదని రాస్తున్నారని.. ఇది సింపుల్ లాజిక్ అని, దీనిపై వివాదాలు ఎందుకు వస్తున్నాయో తెలియదని చెప్పడం.. ఈ మాటలు కాస్త ఎన్టీఆర్ మాటలకు కాంట్రాస్ట్‌గా ఉండడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మహేష్ బాబు నటించిన "''స్పైడర్" మూవీ మీద కూడా మిశ్రమ స్పందనలు రావడం గమనార్హం. కొందరు సమీక్షకులు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తే.. కొందరు సినిమాలో ఏమీలేదని తేల్చేశారు. అటువంటి సందర్భంలో సగటు ప్రేక్షకుడు నిజనిజాలు తేల్చుకోవడానికి థియేటర్‌‌కి వెళ్లడమే మార్గం అని సినీ నిర్మాతలు అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో కత్తి మహేష్,  మిస్టర్ బీ లాంటి వారు వచ్చిన ప్రతీ సినిమాని తమదైన శైలిలో యూట్యూబ్‌లో సమీక్షిస్తున్నారు. టీఎన్‌ఆర్ లాంటి వారు కూడా తమదైన కోణంలో పలు సినిమాలను విశ్లేషిస్తున్నారు. ఇక చిన్నచితకా వెబ్ ఛానల్స్ తమదైన శైలిలో రివ్యూలు ఇస్తున్నాయి. అప్పుడప్పుడు తెలుగు సినిమాలకు బాలీవుడ్ సమీక్షకులు కూడా రివ్యూలు రాయడం పరిపాటిగా మారింది. రాజీవ్ మసంద్ లాంటి వారు బాహుబలి లాంటి సినిమాకి తిరుగులేని రేటింగ్ ఇస్తే.. కేఆర్‌కే లాంటి సమీక్షకులు అసలు పస లేని సినిమాగా తేల్చేశారు. అందుకే ఎవరో ఏం చెపుతున్నారో ప్రేక్షకులు నమ్మడం కష్టమని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. 

 

కనుక, సినిమా రివ్యూలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆలోచిస్తున్న ఈ తరుణంలో... సగటు ప్రేక్షకుడు వినోదం పొందేటందుకే సినిమా చూడాలని భావిస్తే.. ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోకుండా తామే వచ్చి నిజ నిర్థారణ చేయాలని.. అందుకోసం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని.. ఇక్కడ ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు కావాలని పలువురు  సినిమా దర్శకులు, సినిమా నిర్మాతలు భావిస్తున్నారు.