
25 Years Of Sekhar Kammula:
ఇండస్ట్రీలో 25 సంవత్సరాలకు పైగా ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల. కానీ ఆయన తీసింది.. కేవలం 9 సినిమాలే. అయితే ఈ తొమ్మిది సినిమాలు కూడా సినిమా హాల్.. నుంచి బయటకు వచ్చాక కూడా మనల్ని వెంటాడుతాయి. ఒక సినిమా పైన ఆయన రెండు సంవత్సరాల పాటు స్క్రిప్ట్ వర్క్ చేస్తారు అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఆయన చేసే వర్క్ స్క్రీన్ పైన చూసినప్పుడు వృధా అవ్వలేదు అనిపిస్తుంది.
ఆయన రెండు గంటల సినిమా తీసిన, మూడు గంటలు సినిమా తీసిన.. అది సినిమాలా కాకుండా.. జీవిత ప్రయాణంలో అనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే.. ఒక మాస్ ఫైట్.. ఒక ఊర పంచ్ డైలాగ్.. కుదిరితే చేతిలో ఒక సిగరెట్.. లేకపోతే తానే తోపు అని కనిపించేలా మాటలు.. ఇదే ఎన్నో సినిమాలో సాగుతూ ఉంటాయి. కానీ శేఖర్ కమ్ముల హీరో దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. హీరో అంటే ఇతనే ఏమో.. అని ప్రతి అమ్మాయికి అనిపించేలా ఉంటారు.
రూప బాధలో ఉంటే తన పక్కన నిలబడే ఆనంద్ కావచ్చు, సీతా కెరియర్ కి విలువిచ్చే రామ్ కావచ్చు, తన ప్రపంచమే భానుమతి అనుకోని.. ఆమె కోసం తన ఊరికే వచ్చి ఉందిపోయిన వరుణ్ కావచ్చు.. వీళ్ళందరూ కూడా.. నిజజీవితంలో కనిపించే రియల్ హీరో లాగా అనిపించక మానరు.
మరోపక్క సొసైటీ కోణంలో కూడా.. వీళ్లకు వీరే సాటి.. లీడర్, గోదావరి.. అంతెందుకు ఇప్పుడు విడుదలైన.. కుబేర సినిమా కూడా.. సొసైటీ కి ఒక వ్యక్తి అనుకుంటే ఎన్ని విధాల మంచి చేయవచ్చు అని చూపించిన సినిమాలే. విలువలే ఆస్తి.. అని అర్థం వచ్చేలా ఉంటాయి శేఖర్ కమ్ముల ప్రతి సినిమా.
ఆయనకు స్టార్ హీరోలు, బడ్జెట్ అవసరం లేదు. తను నమ్ముకున్న సిద్ధాంతం మాత్రమే కావాలి. అందుకే ధనుష్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీస్తున్న.. హంగులు, ఆర్భాతాలు లేకుండా ఆయన్ని బిచ్చగాడిలా చూపించారు. ఈ సినిమాలో హీరోని బిచ్చగాడిగా చూపిస్తూ కూడా.. ఆ పాత్ర ద్వారా మనకు ఎన్నో విలువలు నేర్పించారు.
సినిమాకి కథ, కథనం బలం.. అయితే వాటిలో కూడా విలువలు ఉండాలి అని నమ్మే అతి కొద్ది మంది దర్శకులలో.. శేఖర్ కమ్ములకు ఒక్కరు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. విశ్వనాథ్ తరువాత అంతలా ఒక అమ్మాయిని చూపించగల దర్శకుడు ఈయన మాత్రమే. ఈయన సినిమాల్లో అమ్మాయిలను చూస్తే.. ప్రతి ఒక్క అమ్మాయి తనని స్క్రీన్ పైన చూసుకున్నట్టు అనిపించక మానదు. గతాన్ని మర్చిపోయి.. తన ఆత్మ అభిమానానికి విలువిచ్చి ముందుకి సాగాలి అనుకునే ఆనంద్ లో రూప కావచ్చు, తన అభిప్రాయాలకు విలువిచ్చుకుంటూ.. తనకు ఇష్టమైన కెరియర్ లో ఎదగాలి అనుకునే గోదావరిలో సీత కావచ్చు, తను ఉన్న ఊరిని, తండ్రిని వదల్లేక.. భర్త ఇల్లరికం రావాలి అనుకునే ఫిదాలో భానుమతి కావచ్చు.. ప్రతి పాత్ర అద్భుతమే. ఈ సినిమాలు చూస్తే..అమ్మాయిలను.. శేఖర్ కమ్ముల చదివేసి ఈ పాత్రలు రాసారేమో అని మనకి తప్పకుండా అనిపిస్తుంది.
శేఖర్ కమ్ముల సినిమాలో ఎక్కడ వెతికినా అశ్లీలత ఉండదు, అంతెందుకు హీరోకి అర్థం పర్థం లేని..ఎలివేషన్స్ ఉండవు. హీరో రఫ్ అండ్ టఫ్ గా కనిపించడు. హీరో సిగరెట్లు తాగరు.. హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేయరు. అలా అని సినిమాలో ఏవో హై బడ్జెట్.. గ్రాఫిక్స్ కూడా ఉండవు. ఇవన్నీ ఉంటేనే సినిమా విజయం సాధిస్తుంది అని అనుకునే ఎంతోమంది దర్శకులు ఉన్న ఈ కాలంలో.. శేఖర్ కమ్ముల నమ్ముకున్న సిద్ధాంతమే ఆయన్ని ముందుకు నడిపిస్తోంది. డాలర్ డ్రీమ్స్ దగ్గర నుంచి.. ఇప్పటి కుబేర వరకు.. సినిమాలు విజయం సాధించిన, అపజయం సాధించిన.. ఆయన ప్రతి సినిమా ఒక వజ్రం లాంటిదే. అందులో మనకు నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది.
అందుకే మనం ఒక సాధారణమైన అమ్మాయి లేదా అబ్బాయి అయితే.. శేఖర్ కమ్ములకి అభిమానిగా మారకుండా ఉండలేము. ఆయన సినిమాల్లో అబ్బాయిలు రియల్ హీరోలు.. అమ్మాయిలు రియల్ హీరోయిన్స్ అని మనకు అనిపించక మానదు. అందుకే ఈ దర్శకుడి ఒక వీరాభిమానిగా.. నేను కానీ.. మీరు కానీ కోరుకోగలిగేది ఒక్కతే.. ఆయన ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి.. సినిమాలలో కూడా ఎంతో విలువ ఉంది.. అనేదాన్ని రుజువు చేసుకుంటూ ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook