)
త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. నెగిటివ్ టైటిల్ తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
మనస్విని (సాహితి అవంచ) తండ్రి బ్యాంక్ ఎంప్లాయ్ (దేవి ప్రసాద్) ట్రాన్ ఫర్ అయి సొంతూరు మచిలీపట్నానికి వస్తారు. దీంతో అదే ఊరిలో ఓ కాలేజీలో పీజీ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో రెండేళ్ల పీజీని ఆరేళ్లుగా చదువుతున్న శ్రీను అలియాస్ శ్రీను (త్రినాథ్ కఠారి) తొలి చూపులోనే మనస్విని ప్రేమిస్తాడు. శ్రీను తండ్రి పెద్ద స్వర్ణకారుడు (గోపరాజు రమణ). తన కుమారుడు కుల వృత్తి చేయక.. అటు సరిగా చదువు కోకపోవడంతో అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో అని కంగారు పడుతుంటాడు. తన కుమారుడు పనికిరాని ఎదవగా పరిగణిస్తుంటాడు. ఇక శ్రీను హీరోయిన్ ను ఎలాగో పటయించి తనను ప్రేమించేలా చేస్తాడు. అయితే తన పెళ్లికి తాను ఒప్పుకుంటే సరిపోదు. తన తండ్రి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెడుతుంది మను. అయితే హీరో క్యారెక్టర్ తెలిసి తన కూతురును ఇవ్వనని చెబుతాడు హీరోయిన్ తండ్రి. ఈ క్రమంలో మను తండ్రి హాస్పిటల్ పాలవుతాడు. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ (తనికెళ్ల భరణి).. ఓ నెల రోజులు పాటు శ్రీనును మను ఫాదర్ ను కలిసి తిరగమని చెబుతాడు. ఈ నెల రోజుల్లో మను తండ్రిని శ్రీను ఇంప్రెస్ చేస్తే పెళ్లి అవుతుందనే కండిషన్ కు ఒప్పిస్తాడు. ఈ క్రమంలో శ్రీను.. తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆమె తండ్రిని ఒప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు. చివరకు శ్రీను, మనస్వనిలు ఒక్కటయ్యారా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో హీరోలు తమను ఎవరో వచ్చిన ప్రమోట్ చేస్తారని ఊరుకోకుండా తమను తామే ప్రమోట్ చేసుకోవడానికి నిర్మాతనే కాకుండా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో హీరో కమ్ దర్శకుడు త్రినాథ్ కఠారి ఎపుడో పాచిపోయిన కథనే కొత్తగా వండివార్చాడు. పోకిరి, దేశముదురు, కిల్లర్, కంత్రి తరహాలో ఈ సినిమాకు ‘ఇట్లు మీ ఎదవ’ అనే నెగిటివ్ టైటిల్ తో ప్రేక్షకుల్లో ఈ టైటిల్ పై అటెన్షన్ క్రియేట్ చేశాడు. హీరో, హీరోయిన్ ను చూసి తొలి చూపులోనే ప్రేమించడం.. ఆపై హీరోయిన్ ఇష్టాలు ఏవో తెలుసుకోవడానికి ముందుగా తనకు తెలిసిన ఓ గర్ల్ ఫ్రెండ్ ను ఆమెకు పరిచమయ్యేలా చేసిన ఆమె ఇష్టాలను తెలుసుకొని తన బుట్టలో పడేలా చేయడం అనే ఓల్డ్ కాన్సెప్టే ఇందులో కనిపిస్తోంది. చదువు అబ్బక.. కుల వృత్తి చేతకాక ఉత్తి ఎదవ అయిన హీరో.. తను ప్రేమించిన యువతి కోసం మామను నెల రోజుల్లో ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో కాస్తంత నవ్వించే ప్రయత్నం చేసాడు. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ తో పాటు కాస్త సెంటిమెంట్ ను పండించి ఎండ్ కార్డ్ వేసాడు. హీరో తండ్రి పాత్రను చూస్తుంటే.. ఓ కామన్ ఆడపిల్ల తండ్రిని గుర్తుకు వస్తుంది.
ఈ సినిమాకు ఆర్పీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు బాగున్నాయి. ఎస్పీ చరణ్ గాత్రం వింటుంటే బాలూను గుర్తుకు వచ్చాడు. సినిమాను ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలా సినిమాను తెరకెక్కించడం అభినందనీయం. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రొటీన్ కథే అయినా.. తనదైన మార్క్ తో ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు హీరో కమ్ దర్శకుడు. కొన్ని సీన్స్ లో కామెడీ పండింది. హీరో స్కూల్ ఎపిసోడ్ కామెడీ ఈ మూవీలో హైలెట్ అని చెప్పాలి. చివర్లో ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం బాగుంది. దర్శకుడిగా త్రినాథ్ కఠారి టేకింగ్ మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసాడు.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో హీరోతో పాటు దర్శకుడిగా రెండు పాత్రలను పోషించాడు. ఇతని యాక్టింగ్ లో రవితేజను ఇమిటేట్ చేస్తున్నట్టు కనిపించింది. కొన్ని సీన్స్ లో ఓ పాపులర్ కమెడియన్ గుర్తుకు వస్తాడు. మొత్తంగా మనకు ఓ రవితేజ వంటి హీరో ఉన్నాడు.నటనతో అతన్ని అనుకరించకుండా సొంత బాణీ ఉండేలా హీరో చేసుకుంటే నటుడిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో త్రినాథ్ కఠారి నటన బాగుంది. కాస్త వేరే హీరోలను అనుకరించడం ఆపితే బెటర్. నటనలో తన ముద్ర ఉండేలా చూసుకోవాలి. హీరోయిన్ గా నటించిన సాహితి అవంచ .. లంగా ఓణీలో సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది. కొన్ని ఎమోషన్ , కామెడీ సీన్స్ ను పండించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన దేవీప్రసాద్ క్యారెక్టర్ ఓ కామన్ ఆడిపిల్ల తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. గోపరాజు రమణ నటన బాగుంది. హీరో ఫాదర్ పాత్రలో ఒదిగిపోయాడు. తనికెళ్ల భరణి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఉన్నది కొన్ని సీన్స్ అయినా.. గుర్తుండి పోతుంది. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘ఇట్లు మీ ఎదవ’.. సరదగా కాసేపు నవ్వుకోవచ్చు..
రేటింగ్: 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.