close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

'కాంచన - 3' మూవీ రివ్యూ; లారెన్స్ ప్రయోగం హిట్టా.. ఫట్టా ?

ప్రయోగాత్మక మూవీ కాంచనా -3 ఈ రోజు తెరపైకి వచ్చేసింది.

Updated: Apr 19, 2019, 09:20 PM IST
'కాంచన - 3' మూవీ రివ్యూ; లారెన్స్ ప్రయోగం హిట్టా.. ఫట్టా ?

న‌టీన‌టులు         : రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, నిక్కి తంబోలి, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, కిషోర్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫి      : వెట్రి, స‌ర్వేష్ మురారి
మ్యూజిక్               : తమన్
క‌థ‌-స్క్రీన్‌ప్లే         : ద‌ర్శ‌కత్వం : రాఘ‌వ లారెన్స్‌
నిడివి                   : 161 నిమిషాలు
విడుదల తేది      : 19 ఏప్రిల్ 2019

 

‘కాంచన’ సిరీస్ లతో వరుసగా హిట్లు కొట్టిన లారెన్స్ ఇప్పుడు ‘కాంచన 3’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హార్రర్ కామెడీ జోనర్ లో బెస్ట్ అనిపించుకున్న లారెన్స్ ఈ సినిమాతో మరో హిట్టు కొట్టాడా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :
దెయ్యం అనే సౌండ్ వింటేనే భయపడే రాఘవ (రాఘవ లారెన్స్) తన కుటుంబంతో కలిసి తాతయ్య షష్టి పూర్తి కోసమని వరంగల్ వెళ్తాడు. అలా తాత ఊరెళ్ళిన రాఘవను తన మావయ్యల కూతుర్లు కావ్య (ఒవియా),ప్రియ (వేదిక),ప్రియా చెల్లి(నిక్కి తంబోలి) ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ముగ్గురిలో తనను బాగా ఆకర్షించిన మరదలిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెడతాడు రాఘవ. అయితే అనుకోకుండా ఆ ఇంట్లోకి రెండు ఆత్మలు ప్రవేశిస్తాయి.
ఇంట్లో వాళ్ళని భయపెడుతూ పగతో రగిలిపోతుండే ఆ ఆత్మలను ఇంటి నుండి బయటకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు రాఘవ తల్లి(కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్) వదిన(దేవ‌ద‌ర్శిని). అయితే ఓ సందర్భంలో రాఘవ లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు రాఘవలోకి కాళి అనే ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుంటారు. ఇంతకీ కాళి ఎవరు..? కాళి తో పాటు ఉండే మరో ఆత్మ ఎవరిది..? రాఘవ ద్వారా కాళి తన పగను ఎలా తీర్చుకున్నాడు.. అనేది మిగతా కథ.
నటీ నటుల పనితీరు :
హార్రర్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన లారెన్స్ మరోసారి తన నటనతో సినిమాకు హైలైట్ నిలిచాడు. రాఘవ , కాళి రెండు పాత్రలతో ఆకట్టుకున్నాడు. వేదిక నటన బాగుంది. ఒవియా , నిక్కి తంబోలి గ్లామర్ క్యారెక్టర్స్ తో ఎట్రాక్ట్ చేసారు. కోవై సరళ , శ్రీమాన్, దేవ దర్శిని మరోసారి కామెడీ పండించి బెస్ట్ అనిపించుకున్నారు. సూరి క్యారెక్టర్ చిన్నదే అయినా తన మార్క్ కామెడీతో అలరించాడు. అనుపమ కుమార్ క్యారెక్టర్ బాగుంది. కబీర్ సింగ్ విలనిజంతో పరవాలేదనిపించుకున్నాడు. మిగతా నటీ నటులంతా వారి పాత్రలకు న్యాయం చేసారు.

 

సాంకేతిక నిపుణుల పనితీరు :
హార్రర్ సినిమాలకు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. ఆ విషయంలో తమన్ ను మెచ్చుకోవాలి. సినిమాకు సరైన నేపథ్య సంగీతం అందించాడు తమన్. సాంగ్స్ ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. సౌండింగ్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. 1400 మంది డాన్సర్స్ తో కోటి ఖర్చుతో షూట్ చేసిన సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సాంగ్స్ కి కోరియోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ తన వర్క్ తో సినిమాకు తగిన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాడు. లారెన్స్ రచయితగా, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

జీ సినిమా సమీక్ష :
‘కాంచన’ సిరీస్ లతో వరుస సక్సెస్ అందుకున్న లారెన్స్ మరోసారి అదే మేజిక్ రిపీట్ చేసాడు. హర్రర్ కామెడీ సినిమాల సీజన్ అయిపొయిందనుకున్న ప్రతీ సారి ఓ స్ట్రాంగ్ పాయింట్ తో వస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూ వస్తున్న లారెన్స్ ఈసారి కూడా కాంచన 3 కోసం మంచి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ రాసుకున్నాడు. అదే సినిమాకు బలం చేకూర్చింది. ఈసారి అనాద పిల్లలు, వారి బాగోగులు చూసే మనుషులతో ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నాడు. అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

దర్శకుడిగా ‘ముని’ నుండి హార్రర్ కి కామెడీ జోడించి ఎంటర్టైన్ చేసిన లారెన్స్ ఈసారి కూడా ఈ రెండిటి మీదే సినిమాను నడిపించి ఎంటర్టైన్ చేసాడు. ప్రారంభంలో వచ్చే సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన లారెన్స్ ఆ తర్వాత మనకిష్టమైన కాంచన కథ చూద్దాం అంటూ అసలు కథలోకి వెళ్ళాడు. ఆ విషయంలో ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేసాడు. అయితే క్లైమాక్స్ తో ప్రేక్షకుల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చాడు.

ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ అలరించింది. ముఖ్యంగా లారెన్స్ , కోవై సరళ, శ్రీమాన్ , దేవదర్శిని మధ్య వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో క్షుద్ర పూజల తాలుకు సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.  ఊహించిన కథే అయినా మళ్ళీ ఓ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ తో, కామెడీతో మేజిక్ చేసాడు లారెన్స్.  రియల్ లైఫ్ లో లారెన్స్ ని బాగా ఇష్టపడే వారికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగాకనెక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే అరవ కామెడీ సన్నివేశాలు బోర్ కొట్టించినా స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.

కొన్ని హార్రర్ సన్నివేశాలు, కామెడీ, నేపథ్య సంగీతం, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు , అరవ కామెడీ , డైలాగ్స్ , సాంగ్స్ సినిమాకు మైనస్. ఓవరాల్ గా హార్రర్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు , పిల్లలకు ‘కాంచన 3’ కచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్ : 3/5

 

@  జీ సినిమాలు