మెగా దర్శకుడు విజయబాపినీడు కన్నుమూత ; ప్రముఖుల సంతాపం

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు (82) ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు అసలు పేరు గుట్టా బాపినీడు చౌదరి. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరును విజయబాపినీడుగా మార్చుకున్నారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు రూపొందించడం గమనార్హం
మెగాస్టార్ కు ప్రాణం పోశారు..
టాలీవుడ్ సామ్రాజ్యంలో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకేంద్రుడు విజయబాపిరాజు.. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌కు ఓ వెన్నుముకలా నిలిచారు. చిరంజీవి నటించిన 'మగమహారాజు'తో దర్శకుడిగా మారిన బాపినీడు.. అనంతరం 'మహానగరంలో మాయగాడు', 'మగధీరుడు', 'ఖైదీ నంబర్ 786', 'గ్యాంగ్ లీడర్', 'బిగ్ బాస్' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లను ఇచ్చారు.
కేసీఆర్, చంద్రబాబు సంతాపం
విజయబాపినీడు మృతిపట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. విజయబాపినీడు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాపినీడు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ చంద్రబాబు కొనియాడారు. విజయ బాపినీడు కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి ప్రకటించారు.