close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

'నువ్వు తోపు రా'  హిట్టా.. ఫట్టా ; మూవీ రివ్యూ మీకోసం...

'నువ్వు తోపు రా' హిట్టా.. ఫట్టా అనే విషయం తెలుసుకోవాలనుకుంటే వివరాల్లోకి వెళ్లండి మరి...!

Updated: May 3, 2019, 03:30 PM IST
'నువ్వు తోపు రా'  హిట్టా.. ఫట్టా ; మూవీ రివ్యూ మీకోసం...

నటీనటులు : సుధాక‌ర్ కోమాకుల‌, నిత్యాశెట్టి, నిరోషా, ర‌వివ‌ర్మ‌, శ్రీధ‌ర‌న్‌, దివ్యా రెడ్డి, జెమిని సురేష్‌ త‌దిత‌రులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
కెమెరా: ప్ర‌శాష్ వేళాయుధ‌న్‌, వెంక‌ట్ సి.దిలీప్‌
నిర్మాత‌: డి.శ్రీకాంత్‌
స్క్రీన్‌ప్లే,దర్శకత్వం : హ‌రినాథ్ బాబు
విడుదల తేది : 3 మే 2019
 
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న సుధాకర్ కొమాకుల ఆ తర్వాత రెండు సినిమాలు చేసినా అవి నిరాశపరిచాయి. ఇక దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి సుధాకర్ ఈ సినిమాతో హిట్టు కొట్టి  తోపు  అనిపించుకున్నాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.
కథ :
సరూర్ నగర్ లో పుట్టిపెరిగిన సూరి(సుధాకర్ కొమాకుల) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తండ్రి మరణంతో ఆ ఉద్యోగం తల్లికి రావడంతో అమ్మ ప్రేమకి దూరమవుతాడు. అప్పటి నుండి గల్లీలో ఉండే వారితోనే గడుపుతూ అల్లరిచిల్లరిగా పెరుగుతాడు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా గడిపే సూరి.. రమ్య(నిత్యా శెట్టి) అనే అమ్మాయిని తొలి చూపులోనే చూసి ప్రేమిస్తాడు. రమ్య కూడా సూరి ప్రేమలో పడుతుంది.

అయితే సూరి నిర్లక్ష్య వైఖరి నచ్చకపోవడంతో అతని నుండి విడిపోతుంది రమ్య. ప్రేమించిన అమ్మాయి దూరమవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్తాడు సూరి. అదే సమయంలో ఓ వ్యక్తి(జెమినీ సురేష్) ద్వారా సూరికి అమెరికా వెళ్ళే ఛాన్స్ వస్తుంది. అలా అమెరికా వెళ్ళిన సూరి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? చివరికి వాటన్నిటినీ జయించి నువ్వు తోపు రా అని ఎలా అనిపించుకున్నాడు..అనేది సినిమా కథాంశం.
 

నటీనటులు పనితీరు :
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో తన టాలెంట్ నిరుపించుకున్న సుధాకర్ మరో సారి తనకి సూటబుల్ అనిపించే క్యారెక్టర్ పిక్ చేసుకున్నాడు. తన నటనతో సరూర్ నగర్ సూరిగా మెప్పించాడు. తెలంగాణా యాసతో ఆ క్యారెక్టర్ కి బలం చేకూర్చి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. నిత్యా శెట్టి పర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకుంది. కాకపోతే హీరోయిన్ గా మెప్పించలేకపోయింది. సినిమా మొత్తంలో నిత్యా ఒక్క చోట కూడా హీరోయిన్ అనే ఫీలింగ్ కలిగించలేదు. వరుణ్ సందేశ్ గెస్ట్ రోల్ కి ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ అనిపించే రోల్ లో కనిపించాడు. తల్లి క్యారెక్టర్ లో నిరోషా నటన బాగుంది. రవివర్మ, జెమినీ సురేష్ తమ రోల్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. మహేష్ విట్టా, జబర్దస్త్ రాకెష్ కామెడీ పండలేదు. మిగతా నటీనటులు వారి పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ‘నాకెంతో నచ్చిందే’ సాంగ్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికా లోకేషన్స్ ని బాగా చూపించారు. ఎడిటింగ్ సినిమాకు మైనస్. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. చంద్రబోస్, కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం పాటలకు ప్లస్ అయ్యింది. హ‌రినాథ్ బాబు డైరెక్షన్ లో లోపాలున్నాయి. కొన్ని సన్నివేశాలను సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.ః

 సమీక్ష :దాదాపు ఏడాది కిందట రిలీజ్ కి రెడీ అయిన సినిమా ఇది. అన్ని అడ్డంకులు దాటి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ‘అల్లరిచిల్లరిగా తిరిగే కుర్రాడు అమెరికా వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు’ అనే కథతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో బలమైన సన్నివేశాలు పడలేదు.

పైగా ఫస్ట్ హాఫ్ కే సినిమా మొత్తం చూసేసిన ఫీలింగ్ ప్రేక్షకులకొస్తుంది. సూటిగా సుట్టిలేకుండా కథలోకి వెళ్తే బాగుండేది. మొదటి భాగం అంతా సాగదీస్తూ ఏదో అలా..అలా నడిపేసాడు దర్శకుడు. ఇక రెండో భాగంలో ఎంటర్టైన్ చేసే స్కోప్ ఉన్నా దాని జోలికెల్లకుండా ఏదో చెప్పే ప్రయత్నం చేసాడు.

మనం ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచితనం మనల్ని ఎక్కడో చోట కాపాడుతుందనే విషయంతో పాటు స్నేహం, జీవితం ఇలా చాలా వాటి గురించి ఏదో చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కానీ ఎన్ని చెప్పిన ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తూ చెప్పాలి. ఇక్కడే దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఇక వరుణ్ సందేశ్ క్యారెక్టర్ కూడా సినిమాకు ప్లస్ కాలేకపోయింది. అసలు వరుణ్ సందేశ్ ఈ క్యారెక్టర్ ఎందుకు చేసాడా..? అనే అనుమానం ప్రేక్షకులకొస్తుంది. చివరిగా వరుణ్ సందేశ్ క్యారెక్టర్ ద్వారా సూరిని నువ్వు తోపురా అనిపించి టైటిల్ కి జస్టిఫికేషన్ దర్శకుడు. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్ కామెడీ నవ్విస్తుంది.

కథలో ఎమోషన్ తో ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. అమెరికాలో ఉండే వివిధ రకాల క్యారెక్టర్స్ తో కామెడీ పండించొచ్చు కానీ సినిమాను సీరియస్ గానే నడిపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అదే సినిమాకు పెద్ద మైనస్. అటు కామెడీ ఇటు సీరియస్ కాకుండా అటు ఇటు కాని దోశలా తయారయింది సినిమా. ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకొని కొన్ని సన్నివేశాలను తొలగిస్తే బెటర్ గా ఉండేది. ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ప్రేక్షకులకు చివర్లో ఓ రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో అమెరికన్స్ తెలుగు పాటలకు డాన్స్ చేసే సన్నివేశం ఇంకాస్త పొడిగించి నవ్వించే ప్రయత్నం చేసుంటే బాగుండేది.

సుధాకర్ పర్ఫార్మెన్స్ , సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ , ‘నాకెంతో నచ్చిందే’ సాంగ్ ,కొన్ని డైలాగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ కాగా కథ -కథనం , ఎడిటింగ్ , బలమైన సన్నివేశాలు లేకపోవడం , కామెడి లేకపోవడం. క్లైమాక్స్ సినిమాకు మైనస్.
 

రేటింగ్ : 2 / 5

 

 

 

 

@ జీసినిమాలు