)
Breast cancer in women: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది రావడానికి గల కారణాలు ఏంటి..? బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకొని.. సమస్యలు తొలి దశలోనే గుర్తిస్తే.. ఆ వ్యాధిని నయం చేసుకునే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట్లో కనిపించే లక్షణాలు..
బ్రెస్ట్ క్యాన్సర్ మొదట్లో అంతగా నొప్పి ఉండదు.. కానీ చిన్న చిన్న మార్పులు మాత్రం మనం గమనించవచ్చు.
1. బ్రెస్ట్ లేదా చంక భాగంలో చిన్న గడ్డ లేదా గట్టిదనంగా అనిపించడం.
2. బ్రెస్ట్ ఆకారంలో, సైజ్‌లో, రూపంలో మార్పు రావడం.
3. నిపుల్ (చనుమొనలు) చుట్టూ ఎర్రగా లేదా పొరలుగా మారడం.
4. నిపుల్ లోపలకు ముడుచుకోవడం లేదా ఏదైనా రక్తం కలిసిన ద్రవం బయటకు రావడం.
5. ఉన్నట్టుండి నొప్పి రావడం లేదా సున్నితంగా అనిపించడం.
6. చర్మం మీద పొరలు పడినట్టు, ముడుచుకున్నట్టు, నారింజ తొక్కలాగ కనిపించడం.
* మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే అన్ని సందర్భాల్లోనూ ఖచ్చితంగా క్యాన్సర్ అని కాదు.. కానీ వెంటనే డాక్టర్‌కి చూపించాలి. మార్పు ఏదైనా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.
* స్త్రీలు నెలకోసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. 40 ఏళ్లు దాటిన వాళ్లు లేదా కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లయితే.. మామోగ్రఫీ టెస్ట్ క్రమం తప్పకుండా చేయించుకోవడం మంచిది.
బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఎలా గుర్తిస్తారు..?
డాక్టర్లు మొదట క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. తరువాత మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ లేదా ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ టెస్టులు, అలాగే బయాప్సీ ద్వారా ఫైనల్‌గా క్యాన్సర్ ఉన్నదో, లేదో నిర్ధారిస్తారు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ మరియు మాలిక్యులర్ టెస్టుల ద్వారా క్యాన్సర్ రకాన్ని గుర్తించి, పేషెంట్‌కి సరిపోయే ట్రీట్మెంట్ని ప్లాన్ చేస్తున్నారు.
చికిత్స పద్ధతులు ఏంటి..?
బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఒకే రకమైన చికిత్స ఉండదు. క్యాన్సర్ స్టేజ్, ట్యూమర్ స్వభావం, పేషెంట్ ఆరోగ్యం ఆధారంగా వైద్యులు చికిత్స పద్ధతిని ఎంచుకుంటారు.
అందులో కొన్ని ఏంటంటే...!
1. శస్త్రచికిత్స (Surgery)..
చిన్న గడ్డ అయితే లంపెక్టమీ (బ్రెస్ట్‌ని కాపాడుతూ గడ్డ తీసివేయడం), పెద్దదైతే మాస్టెక్టమీ (బ్రెస్ట్ మొత్తం తీసివేయడం). సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ లేదా యాక్సిల్లరీ డిసెక్షన్ ద్వారా ఎంత వరకూ వ్యాపించిందీ తెలుసుకుంటారు.
2. రేడియేషన్ థెరపీ..
లంపెక్టమీ ద్వారా గడ్డని తీసేసిన తర్వాత, మిగిలిన క్యాన్సర్ కణాల్ని నిర్మూలించడానికి రేడియేషన్ ని ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ మళ్లీ తిరగబడకుండా చూస్తారు.
3. కీమోథెరపీ..
సర్జరీకి ముందు అయితే ట్యూమర్‌ని చిన్నగా చేయడానికి లేదా సర్జరీ తర్వాత అయితే, చుట్టూ మిగిలిన క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఇస్తారు.
4. హార్మోన్ థెరపీ..
హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ట్యూమర్లలో, క్యాన్సర్‌పై ఈస్ట్రోజెన్ ప్రభావాన్ని అడ్డుకునే మందులు ఇస్తారు.
5. టార్గెటెడ్ థెరపీ..
HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై నేరుగా దాడి చేసేందుకు, ట్రాస్టుజుమాబ్ లాంటి మందులను ఇస్తారు.
6. ఇమ్యూనోథెరపీ..
బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ని యాక్టివ్ చేసి, క్యాన్సర్‌ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్లకు ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ నివారణ, అవగాహన..
* అన్ని క్యాన్సర్లని నివారించడం సాధ్యం కాకపోయినా, తగిన బరువులో ఉండడం, మద్యం తగ్గించడం, ప్రతీ రోజు వ్యాయామం చేయడం, పౌష్ఠికాహారం తినడం లాంటి జీవన శైలిలో మార్పుల ద్వారా రిస్క్‌ని తగ్గించవచ్చు.
* ముఖ్యంగా మనకి, మన వాళ్లకి, అవగాహన ఉండాలి. స్క్రీనింగ్ టెస్టులు, హెల్త్ క్యాంపులు, మహిళల అవగాహన కార్యక్రమాలని అటెండ్ అవండి. ఇవన్నీ ప్రాణాలు కాపాడగలవు. చివరిగా చెప్పేదేమిటంటే, బ్రెస్ట్‌లో ఏవైనా మార్పులు గమనిస్తే వదిలేయకండి. అలాగే మీకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే.. డాక్టర్. శ్రావణ్ కుమార్, కన్సల్టెంట్ (Medical Oncology and Bone Marrow Transplant Physician) మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ గారిని కలువొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook