)
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర నేతలు రంగంలోకి దిగారు. అన్ని వార్డుల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. త్వరలోనే జాతీయ స్థాయి నేతలతోనూ ప్రచారానికి నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ లిస్టును ప్రకటించారు. ఇందులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘవాల్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ లాంటి నేతలు ఉన్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రచారానికి రప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు నేతలు ప్రచారానికి వస్తే.. పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని కమలం పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో లక్షా 30 వేలకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఇక కమ్మ సామాజికవర్గానికి భారీగా ఓట్లు ఉన్నాయి.. జూబ్లీహిల్స్ గెలుపులో కమ్మలు గెలుపు ఓటములను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నారు. అందుకే కమ్మ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇప్పటికే కమ్మ సంఘం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. వారి సమస్యలు విన్నారు.
రాష్ట్రంలో కమ్మవారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అటు కమ్మలు కూడా సీఎంతో సమావేశం సక్సెస్ అయ్యిందని ప్రకటించారు. అంతకుముందు సినీ కార్మికులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికులకు అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా కమ్మ వారికి టచ్ లోకి వెళ్లారు. కమ్మ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వెంగళ్ రావు నగర్ లో కమ్మవారికి ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కమ్మ ఓటర్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు పెంచడాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు వారి మద్దతు కోసం సీఎం చంద్రబాబును రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యింది..
ఇప్పుడు ఏపీలో కూటమి పార్టీల పాలన నడుస్తోంది. మూడు పార్టీలు ఆలయన్స్ గా ఉన్నాయి. అటు కేంద్రంలోనూ టీడీపీ చేరింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు బీజేపీ కోరితే మద్దతు ఇచ్చేందుకు రెడీ అని ముందే ప్రకటించారు. అయితే ఇప్పుడు కమ్మ ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ ఫెయిల్ అయ్యిందనే చర్చ జరుగుతోంది. అందుకే రాష్ట్ర నేతలు బీజేపీ నేతల దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ ఓటర్లను కాషాయ పార్టీ వైపు తిప్పుకోవాలంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ వారిద్దరూ ప్రచారానికి వస్తే వారితో ఒక రోడ్ షో, మరో బహిరంగసభలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన పార్టీలు భాగస్వాములుగా ఉన్నారు. వారిని ఒప్పించడం పెద్దగా కష్టమేమీ కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారట. మరి కమలనాథుల వినతిని స్వీకరించి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగితే.. మొత్తం సీన్ మారిపోయే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ ను కాషాయ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలకు జూబ్లీహిల్స్ గెలుపు మరింత దగ్గర చేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే వీలైనంత ఎక్కువ మంది నేతలను రంగంలోకి దింపాలని చూస్తున్నారట. మరోవైపు ఏపీ బీజేపీ నేతలను సైతం రంగంలోకి దింపబోతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో మంత్రి సత్యకుమార్ ఉన్నారు. ఆయన కూడా బీజేపీకి మద్దతుగా ప్రచారానికి రెడీ అయ్యారు. మొత్తంగా చంద్రబాబు, పవన్ రంగంలోకి దిగితే.. మాత్రం.. బీజేపీకి మరింత అడ్వాంటేజ్ గా మారడం ఖాయమనే ప్రచారమైతే జరుగుతోంది. చూడాలి మరి కమలనాథుల రిక్వెస్ట్ పై ఏపీ నేతలు ఎలా స్పందిస్తారో..!