)
Kavitha New Party: భారతీయ రాష్ట్ర సమితి పార్టీ మాజీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు చాలా మందికి ఆమెతో టచ్ లో ఉన్నారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె త్వరలో కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు జోరు అందుకున్నాయి. వీటిపై కల్వకుంట్ల కవిత ఈ విధంగా స్పందించారు.
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. అయితే వివిధ వర్గాలకు చెందిన వారితో దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు ఆమె అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో ఆమె అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త పార్టీపై కవిత చర్చలు
అప్పట్లో కొత్త పార్టీ పెట్టే ముందు తన నాన్న కేసీఆర్ గారు వందల మందితో చర్చలు జరిపినట్లు కవిత గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తానూ అదే పని చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అయితే కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె అన్నారు. కానీ ఒక వర్గం కోసం కాకుండా ప్రజలందరితో, వారి కోసం పని చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. బీసీల సమస్య తన మనసుకు చాలా దగ్గరగా అనిపించిందని కవిత తెలిపారు.
కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కవిత అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. కాంగ్రెస్ పెద్దలు లేదా నేతలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. అలాగే నేను కూడా ఎవరితో ఈ విషయం గురించి సంప్రదించలేదు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే నా పేరు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. బహుశా ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోవాలనుకుంటున్నారేమో" అని కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీపై వ్యాఖ్యలు
తన తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని తానే అంటూ కవిత నిరాశను వ్యక్తం చేశారు. "నేను ప్రస్తుతం ఒక ఫ్రీ బర్డ్ లా ఉన్నాను. నా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. చాలామంది నన్ను కలుస్తున్నారు. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల జాబితా చాలా పెద్దది" అని ఆమె అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావుతో విభేదాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తాను కేటీఆర్‌ను ముందే హెచ్చరించినట్లు కల్వకుంట్ల కవిత గుర్తుచేశారు. "2016లోనే ఇరిగేషన్ శాఖ విషయంలో కేటీఆర్ ను అలర్ట్ చేశాను. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దే అని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్ప హరీష్ రావుపై నాకు వేరే కోపం లేదు" అని కవిత స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook