ఈ పెన్ను ఎన్ని పదాలు రాస్తుందో చెప్పేస్తుంది

ఈ బాలమేధావి పెన్ను ఎన్ని పదాలు రాస్తుందో చెప్తుంది.

Updated: Apr 16, 2018, 05:05 PM IST
ఈ పెన్ను ఎన్ని పదాలు రాస్తుందో చెప్పేస్తుంది

జమ్మూకాశ్మీర్‌కు చెందిన తొమ్మిదేళ్ల ముజఫర్ అహ్మద్ ఖాన్ అనే బాలుడు తయారుచేసిన 'కౌంటింగ్ పెన్' ప్రశంసలు అందుకొంటోంది. ఈ పెన్ ద్వారా ఎన్ని పదాలు రాస్తున్నామో వాటి సంఖ్య పెన్ను పైభాగంలో గల  ఎల్‌సీడీ మానిటర్‌లో కనిపించడంతో పాటు మొబైల్‌కు మెసేజ్ కూడా వస్తుంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాక ఈ కౌంటింగ్ పెన్ ఆలోచన చేశానని ముజఫర్ చెప్పాడు.  

'క్రితంసారి రాసిన పరీక్షల్లో తక్కువ పదాలు రాసినందుకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ విషయం నన్ను చాలా నిరాశపరిచింది. టైంను ఆదా చేసుకోవడానికి ఏదైనా కనిపెట్టాలని నేను అప్పటి నుంచి ఆలోచించాను. ఆఖరికి కౌంటింగ్ పెన్ ఆలోచన నా బుర్రకు తట్టింది' అని ఆ కుర్రాడు చెప్పాడు.

కాగా ముజఫర్ తాను చేసిన ఈ 'కౌంటింగ్ పెన్' ఆవిష్కరణను రాష్ట్రపతి భవన్‌లో జరిగిన డిపార్టుమెంటు ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ అధ్వర్యంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) నిర్వహించిన 'ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రిప్రీన్యూర్ షిప్' కార్యక్రమంలో కూడా ప్రదర్శించడం విశేషం. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆ ప్రదర్శనను చూసి ఆ బాల మేధావిని మెచ్చుకున్నారు. రివార్డు కూడా ప్రకటించారు. ఈ పెన్ను ఆవిష్కరణ పరీక్షల్లో వ్యాసాలు, పెద్ద పెద్ద సమాధానాలు రాసే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

'మే' నెలలో ఈ పెన్ను మార్కెట్‌లోకి రానున్నదని ముజఫర్ అహ్మద్ ఖాన్ చెప్పాడు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) కూడా ఈ పెన్నును మార్కెట్‌లో అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించింది.