2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కునేందుకు ప్రతిపక్షాలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఎన్నికలకు ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈమేరకు మే 24వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అజయ్ మాకెన్ ఇద్దరూ ఆప్ నేతలతో చర్చలు జరిపినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఇటీవల కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీజేపీపై పై చేయి సాధించిన నేపథ్యంలో 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిపక్షాలతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచించుకుంటోందనేది ఆ వార్తల సారాంశం. ఢిల్లీలో ఏడు లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా అందులో ఐదు సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం తమ పార్టీకే ఇవ్వాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ కోరగా కాంగ్రెస్ మాత్రం ఏడింటింలో నాలుగు సీట్లు ఇవ్వడానికే సిద్ధంగా వున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వార్తా కథనాల సారాంశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కోరుతున్న లోక్ సభ స్థానాల జాబితాలో న్యూ ఢిల్లీ-శర్మిష్త ముఖర్జీ, చాందిని చౌక్-అజయ్ మాకెన్, నార్త్ వెస్ట్ ఢిల్లీ-రాజ్ కుమార్ చౌహన్ ఉన్నాయి. 


మొన్నటికి మొన్న గురువారంనాడు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి విద్యావేత్త ప్రధాని అయితే దేశం బాగుంటుంది అని ట్వీట్ చేయడం ఈ రెండు పార్టీల కూటమి ఏర్పాటు వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.