రైతులను ఆదుకుంటా: బిగ్ బీ రైతు రుణ మాఫీ
రైతులను ఆదుకుంటా: బిగ్ బీ రైతు రుణ మాఫీ
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రైతుల రుణాలను తీరుస్తానంటూ బిగ్ బీ తాజాగా ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ బిగ్ బీ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో రుణం తీర్చలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేద రైతులను ఆదుకుంటానని చెప్పారు. వారి మొత్తం రుణాలూ కలిసి రూ.5.5 కోట్లని, ఆ రుణాలను చెల్లించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని మిగతా ప్రాంతాల రైతుల కోసం మరింత చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న అన్నదాతలకు ఉడతాభక్తిన సాయం చేయడం ఎంతో తృప్తినిచ్చే విషయమని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. వారికి చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని పేర్కొన్నారు.
తాను గతంలో మహారాష్ట్రలోని 350 మంది పేద రైతుల రుణాలను చెల్లించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 'కొన్ని రోజుల క్రితం రైతుల రుణాలు చెల్లించాం. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లోనూ రైతుల పంట రుణాలు చెల్లించాం. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో రుణాలు చెల్లించాల్సి ఉంది' అన్నారు.
'కౌన్ బనేగా కరోడ్ పతి కరంవీర్' అజీత్‌సింగ్‌కు కూడా సాయం అందచేస్తానని బిగ్ బీ చెప్పారు. వ్యభిచార కూపంలోకి బలవంతంగా నెట్టివేయబడిన యువతుల పునరావాసం, రక్షణకల్పనకు అజీత్‌సింగ్ శ్రమిస్తున్నారు. అజీత్‌సింగ్‌కు తాను చెక్కును పంపనున్నట్లు కూడా అమితాబ్ తెలిపారు.
మరోవైపు రైతుల రుణాలను చెల్లిస్తున్న అమితాబ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరో అని అంటున్నారు. బిగ్ బీ అన్నదాతల కోసం నడుం బిగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.