ఆదివారం బీహార్‌లోని దర్బంగ జిల్లాలో బహేరీ బ్లాక్‌ సిరువా గ్రామంలో దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలించి దేవతకు అర్పించిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. కళ్లవెంట ధారలా కారుతోన్న నెత్తురు చూసి అర్చకుడితో సహా అందరూ విస్తుపోయారు. వెంటనే తేరుకుని సమీపంలోని ఆస్పత్రికి ఆమెను తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి దర్భాంగ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై, ఇంటివద్దే ఉంటోన్న ఆ బాలిక.. గత కొన్ని రోజులుగా దుర్గామాత తన కలలో వస్తూ ఏదో ఒక అవయవాన్ని అర్పించమని కోరేదని వాపోయింది. కాగా ఏ దేవత కూడా భక్తులను అవయవాలు అర్పించమని కోరదని అర్చకులు స్పష్టం చేస్తుండగా.. సదరు బాలిక మానసిక రుగ్మతతో బాధపడుతున్నందుకు ఇలా చేసిందని వైద్యులు వెల్లడించారు.


తాను పనిచేసే ఆలయంలో ఊహించని సంఘటనపై అర్చకుడు భవ్‌నాథ్‌ ఝా స్పందించారు. ‘నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఈరోజు కంటి ఆకారంలో ఉండే బెల్‌ పండ్ల గింజలను సమర్పిస్తాం. కానీ ఈ అమ్మాయి నిజం కళ్లనే పీకేసుకొని సమర్పించడం ముమ్మాటికీ మూర్ఖత్వమే. ఏ దేవతా భక్తులను అవయవాలు అర్పించమని కోరదు’ అని అన్నారు.