)
26/11 Mumbai Attack: ముంబై 26/11 ఉగ్రదాడుల విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనా అజ్ఞానం, భద్రతా వైఫల్యం కారణంగా వందలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆరోపించింది. దేశ భద్రతను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జాతి మనసుకు గాయంగా మారాయని ఆరోపించింది. 26/11కి ముందు అనేక ఉగ్రవాద దాడులు జరిగినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని తెలిపింది. యూపీఏ హయాంలో వివిధ భద్రతా ఏజెన్సీలు సమన్వయం లేకుండా పని చేశాయని.. హెచ్చరికలు వచ్చినా వాటిని పట్టించుకోలేదని విమర్శించింది. ఫలితంగా ఉగ్రవాదులు సులభంగా ముంబై గుండెల్లోకి చొరబడగలిగారని విమర్శించింది. ఉగ్రదాడులను తేలికగా తీసుకునే ‘చల్తా హై’ సంస్కృతి కాంగ్రెస్‌లో పాతుకుపోయిందని.. భారతీయుల ప్రాణాలను లెక్కచేయని దృక్పథం వారి నైతిక దివాళాను బయటపెట్టిందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
"భారతదేశానికి వేల కిలోమీటర్ల తీరరేఖ ఉన్నా.. సమర్థవంతమైన తీరభద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పడవల ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించడం ఎంతో సులభంగా మారిందని.. ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనం. 26/11 సమయంలో ఎన్ఎస్జీ కమాండోలు ఢిల్లీ నుంచి రావాల్సి రావడం వల్ల సమయం వృథా అయింది. అధికార అనుమతుల ప్రక్రియలో ఆలస్యం కారణంగా విలువైన ప్రాణాలు పోయాయి. అంతేకాక అప్పటి హోంమంత్రి విమానంలో చేరేందుకు మూడు గంటల పాటు కమాండో విమానం టార్మాక్‌పై వేచిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానంతో దేశవ్యాప్తంగా 7 ఎన్ఎస్జీ హబ్‌లు ఏర్పాటు చేశారు. అమిత్ షా నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి పూర్తి విరుద్ధం.
ముంబై పోలీసులు అసాధారణ ధైర్యంతో పోరాడినా.. పాత ఆయుధాలు, సరైన రక్షణ సామగ్రి లేకుండా ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది. 2జీ, కామన్వెల్త్, కోల్ స్కామ్‌ల వంటి కుంభకోణాలతో ప్రజాధనం దోచుకున్న కాంగ్రెస్ నేతలకు పోలీసుల ఆధునీకరణకు నిధులు కేటాయించాలనే ఆలోచన కూడా లేకపోయింది. ప్రధాన్ కమిషన్ నివేదిక కూడా కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. 2007 తర్వాత పోలీసులకు సరైన కాల్పుల శిక్షణ కూడా ఇవ్వలేదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.
దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిన వేళ.. కాంగ్రెస్ నేతలు సత్యాన్ని వక్రీకరించే కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ‘సఫ్రాన్ టెర్రరిజం’ వంటి పదాలతో మెజారిటీ వర్గాన్ని దారి తప్పించే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో, దౌత్య సంబంధాలను కాపాడుకోవడం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహించింది. అప్పటి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్ చేసిన ‘పెద్ద నగరాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి’ అనే వ్యాఖ్య ప్రజావ్యతిరేక దృక్పథాన్ని ప్రతిబింబించింది. 60 గంటల పాటు దేశం ప్రభుత్వ లేమి స్థితికి చేరింది. ప్రజలు పరిపాలనపై నమ్మకం కోల్పోయారు. సైబర్ నిఘా వ్యవస్థ కూడా అప్పట్లో బలహీనంగా ఉండేది. తక్షణ సమాచారం అందించే సాంకేతిక సామర్థ్యం ప్రభుత్వం వద్ద లేకపోయింది. మొత్తం మీద 26/11 విషాదానికి కాంగ్రెస్ పాలనలోని నిర్లక్ష్యం, అజాగ్రత్త, నిర్ణయాహీనతే ప్రధాన కారణం.." అని బీజేపీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook