బీజేపీ చీఫ్ ఎన్నికకు ముహుర్తం ఖరారు; కమలం పార్టీ తదుపరి రథ సారథి ఎవరు ?

అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకోనున్న బీజేపీ

Last Updated : Aug 19, 2019, 12:32 PM IST
బీజేపీ చీఫ్ ఎన్నికకు ముహుర్తం ఖరారు; కమలం పార్టీ తదుపరి రథ సారథి ఎవరు ?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 31 కల్లా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకియ పూర్తి చేయాలని ఆ పార్టీ నిర్ణయిచింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి పదవులకు సంబంధించిన ఎన్నికల్లో ప్రజా స్వామ్య పద్దతిని కచ్చితంగా పాటిస్తామన్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు.

అంతర్గత ఎన్నికల షెడ్యూల్...
ఈ సందర్భంగా  పార్టీ అంతర్గత ఎన్నికల షెడ్యూల్ ను జేపీ నడ్డా ప్రకటించారు. సెప్టెంబర్ లో బూత్ స్థాయి ఎన్నికలు , అక్టోబర్ లో మండల స్థాయి ఎన్నికలు, నవంబర్ లో జిల్లా స్థాయి ఎన్నికలు, డిసెంబర్ 15న రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇవి ముగిసిన తర్వాత చివరగా డిసెంబర్ 31న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని నడ్డా తెలిపారు.

వారసత్వ రాజకీయాలకు చెక్
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ఇతర పార్టీలు వారసుల కోసం ఆరాటపడుతుంటాయని...తమ కుమారులు, కుమార్తెల కోసం పార్టీ పగ్గాలు ఇప్పించాలని కొందరు తపన పడుతుంటారని కాంగ్రెస్ పార్టీ ని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీనే అని నడ్డా తెలిపారు. సాధారణ స్థాయి నుంచి వచ్చిన మోడీ ప్రధాని అయ్యారని..అలాగే అమిత్ షా జాతీయ అధ్యక్షుడు అయ్యారని.. ఇది ఒక బీజేపీలోనే ఇది సాధ్యమని చెప్పారు.

తదుపరి అధ్యక్షుడు జేపీ నడ్డా !

ప్రస్తుతం బీజేపీ చీఫ్ గా ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పార్టీ సాంప్రదాయన్ని అనుసరించి ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల అంసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అమిత్ షాకు ప్రత్నామ్నాయంగా బీజేపీ హైకమాండ్ జేపీ నడ్డాను తెరపైకి తెచ్చింది.ఈక్రమంలో ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ గా ఎన్నుకొంది. అధ్యక్ష ఎన్నికల నాటికి  జేపీ నడ్డాను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Trending News