)
Census Notification: కేంద్ర ప్రభుత్వ జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్ ప్రకారం నాలుగు ప్రాంతాల్లో తొలి దశలో జనగణన ఉంటుంది. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో జరగనుంది. జనగణనతో పాటు కులగణన కూడా తొలిసారిగా చేపట్టనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనగణన గెజిట్ ప్రకారం వచ్చే ఏడాది 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభం కానుంది. ముందుగా లడఖ్, జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆ తరువాత అంటే 2027 మార్చ్ 1 నుంచి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగనుంది. ఈసారి జనగణనకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి తొలిసారిగా పూర్తిగా డిజిటల్ రూపంలో జనగణన ఉంటుంది. రెండవది జనగణనతో పాటు కుల గణన కూడా జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో కుల గణన జరగడం ఇదే తొలిసారి. మొత్తం డేటాను ట్యాబ్స్ ద్వారా సేకరిస్తారు. ప్రభుత్వం సిద్ధం చేసిన పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తారు. దేశవ్యాప్తంగా 16 భాషల్లో ఇది ఉంటుంది. డేటా భద్రంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ భరోసా ఇస్తోంది.
దేశవ్యాప్తంగా ఇది 16 జనగణన కాగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత 8వది. చివరిసారిగా 2011లో జరిగింది. లెక్క ప్రకారం 2021లో జరగాల్సి ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. మొత్తానికి 15 ఏళ్ల తరువాత తిరిగి జరిపేందుకు రంగం సిద్ధమైంది. జనగణనకు మొత్తం 30 ప్రశ్నలు సిద్ధమయ్యాయి. ప్రతి రాష్ట్రంలో 2 దఫాల్లో ఇది జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు కాగా ఇందులో పురుషుల సంఖ్య 62.27 కోట్లు ఉంది. మహిళల సంఖ్య 58.64 కోట్లు ఉంది. ఈసారి అన్ని కులాలను లెక్కించనున్నారు. అంటే జనగణనతో పాటు కులగణన కూడా ఉంటుంది.
జనగణన కోసం దేశవ్యాప్తంగా 34 లక్షల మంది ఎన్యూమలేటర్లు, సూపర్ వైజర్లతో పాటు 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. దీనికోసం ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్లో 574.80 కోట్లు కేటాయించారు. మొత్తం ఖర్చు 13 వేల కోట్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి 1800 మంది మాస్టర్ ట్రైనర్లు, 45 వేల మంది ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. వీరంతా ఇతర సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు. దేశంలో చివరిసారిగా కులగణన 1931లో జరిగింది.
జనగణనతో పాటు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి కండీషన్ ఎలా ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనే వివరాలు తీసుకుంటారు. ఒక ఇంట్లో ఎంతమంది నివాసముంటున్నారు, సామాజిక, ఆర్ధిక పరిస్థితులేంటనేది సేకరిస్తారు. కులం, ఉపకులం వివరాలు తీసుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook