ఢిల్లీలో AAP ఎమ్మెల్యేపై కాల్పులు.. ఒకరి మృతి
ఎన్నికల్లో విజయం సాధించిన రోజే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కాల్పులు జరగడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసి విచారణ చేపడితే నిందితుడు దొరుకుతాడని ఎమ్మెల్యే నరేష్ యాదవ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విజయాన్ని జీర్ణించుకోలేని ఓ దుండగుడు ఆ పార్టీ ఎమ్మెల్యే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ మెహ్రౌలీలోని ఓ ఆలయాన్ని మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 11న) సందర్శించుకున్నారు. తిరిగి వెళ్తుండగా అరుణా అసఫ్ అలీ మార్గ్‌కు చేరుకున్న ఆయన కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపిన అనంతరం ఆ వ్యక్తి పరారైనట్లు తెలుస్తోంది.
Also Read: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్
దుండగుడి కాల్పుల్లో ఓ ఆప్ కార్యకర్త ప్రాణాలు కోల్పోగా, మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై కాల్పుల ఘటనపై మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. తన కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు ఎవరు జరిపారో, ఎందుకు జరిపారో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు సరిగా విచారణ చేస్తే నిందితుడిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవచ్చన్నారు. బుధవారం ఉదయం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విజయకేతం ఎగరవేసింది. 70 స్థానాలకుగానూ 62 సీట్లలో ఆప్ విజయం సాధించగా, బీజేపీ 8సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం గమనార్హం.
Also Read: ఢిల్లీలో కాంగ్రెస్‌కు మళ్లీ ‘సున్నా’లేశారు!