)
Hyderabad Heavy Rain Update: భారీ వర్షం హైదరాబాద్‌లో విషాదం నింపింది. ఆసిఫ్‌నగర్ అఫ్జల్‌సాగర్‌లోని మంగారుబస్తీలో ఇద్దరు గల్లంతు అయ్యారు. నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది.. మామ, అల్లుడు కోసం గాలిస్తున్నారు. అఫ్జల్‌సాగర్ నాలాను దాటే క్రమంలో అదుపుతప్పి నాలాలో పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ముషీరాబాద్‌లోనూ ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా, గోడ కూలడంతో సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు. సన్నీ కోసం కూడా అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.నిన్న హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కాళరాత్రి అనే చెప్పాలి. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12.7, సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్‌లో 12.1 సెం.మీ, జవహర్‌నగర్‌లో 11 సెం.మీ, షేక్‌పేటలో 10 సెం.మీ, కాప్రాలో 9.1 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 7.7 సెం.మీ, ఉప్పల్‌లో 7.5 సెం.మీ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ముషీరాబాద్, తార్నాక, లక్డీకాపూల్, కాచిగూడ వంటి పలు ప్రాంతాల్లో కుండపోత వర్సం పడి రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సెలవు కావడంతో పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు మాత్రం వర్షం నుంచి తప్పించుకునేందుకు ఫ్లైఓవర్ల కింద ఆశ్రయం పొందారు. కొన్ని చోట్ల వాహనాలు స్టార్ట్ కాక రోడ్ల మధ్యలోనే ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది.
ఇక వర్షానికి సంబంధించి అత్యవసర చర్యలు తీసుకోవడానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా నిలిచిపోయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బృందాలు చురుకుగా పని చేశాయి. వర్షపు నీరు నాలాలోకి వెళ్లేలా మ్యాన్‌హోల్స్ తెరిచి నీటిని తరలించే చర్యలు చేపట్టాయి. అయితే మ్యాన్‌హోల్స్ తెరిచి ఉంచితే ప్రమాదకరమవుతుందని ఇప్పటికే ప్రజలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టంగా హెచ్చరించారు.
మరోవైపు వర్షాలు నగరంలో ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మరింతగా ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నగరంలో ఆకస్మిక వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. రాత్రి పూట చాలా చోట్ల అర్ధరాత్రి వరకు కరెంట్ లేదు. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి తెల్లార్లు కరెంట్ పోతూ వస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందుకు గురి చేసింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.