)
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో భారత్ కసితీరా బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వాయుసేన పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. పాక్ కీలక స్థావరాలు, రన్‌వేలను తునాతునకలు చేసింది. పాక్ సరిహద్దు ప్రాంతాలపై వేల సంఖ్యలో ప్రయోగించిన డ్రోన్ బాంబులు, క్షిపణులను నేల కూల్చింది. యుద్ధం మొదలు కాకముందు భారత్ ముగించేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే శత్రువుకు తీవ్ర నష్టం కలిగింది. భారత సైనిక సామర్థ్యం ఏంటో పాక్‌తో పాటు ప్రపంచం ప్రత్యక్ష్యంగా చూసింది.
భారత్ ఇప్పుడు మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. మన సైన్యాన్ని మరింత శత్రుదుర్భేద్యంగా తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత త్రివిధ దళాలకు అధునాతన ఆయుద్ధ సంపత్తిని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15 ఏళ్ల వ్యవధిలో కొనుగోలు చేయాల్సిన ఆయుధాలు, యుద్ధ విమానాలు, వివిధ వ్యవస్థలకు సంబంధించి అతిపెద్ద సమీకరణ ప్రణాళికను రక్షణశాఖ ఆవిష్కరించింది. అణుశక్తి యుద్ధ నౌకలు, నెక్స్ట్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, స్టీల్ట్ బాంబర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత ఆయుధాలతో మన అమ్ములపొదిలో చేర్చుకోవాల్సిన అస్త్రాల జాబితాను సిద్ధం చేసుకుంది. ఇందుకోసం వేల కోట్లను వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రక్షణ శాఖ దాదాపు 15 ఏళ్ల వ్యవధిలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. కనీసం 500కు తగ్గకుండా హైపర్సోనిక్ క్షిపణులను బలగాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం పాత టీ-72 యుద్ధ ట్యాంక్‌లను 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంక్‌లతో భర్తీ చేయనుంది.
మరో 400 తేలికపాటి ట్యాంక్‌లను దళాలకు అందించనుంది. ట్యాంక్‌పై నుంచి ప్రయోగించే 50వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, 6 లక్షల శతఘ్ని గుండ్లు, మానవ రహిత విమానాలను సమకూర్చుకోనుంది. 700 రోబోటిక్ కౌంటర్ IED సిస్టమ్‌లను రంగంలోని దించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నౌకాదళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 10 అత్యాధునిక ఫ్రిగెట్లు, 7 అడ్వాన్స్డ్ కార్వెట్టీలు, 4 ల్యాండ్ డాక్ ప్లాట్‌ఫారమ్స్, హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌ను సేకరించేందుకు పచ్చజెండా ఊపింది.
వాయుసేన కోసం 75 హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్ సాయంతో పనిచేసే విమానాలు, గైడెడ్ ఆయుధాలు, 20 స్ట్రాటోస్పియరిక్ ఎయిర్ షిప్‌లను సమకూర్చనుంది. 21 శతాబ్దంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ దిశలో యాంటీ స్వార్మ్ డ్రోన్ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, మానవ రహిత విమానాల కోసం గగనతలం నుంచి భూతలంపైకి సంధించే క్షిపణులు, అత్యాధునిక టార్గెటింగ్ పాడ్స్ వంటివి కూడా కేంద్రం నిర్దేశించుకున్న జాబితాలో ఉన్నాయి.
ఇదే సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలను పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది. రోబోటిక్స్, కృత్రిమ మేధ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆయుధ తయారీలో విస్తృతంగా వినియోగించుకునే దిశగా.. రంగం సిద్ధం చేసుకుంటోంది. దేశీయ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని రక్షణశాఖ కోరింది.
ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరికొన్ని సమకూర్చుకోవటంపైనా భారత్ దృష్టి సారించింది. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన పేర్కొనటంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యర్థి క్షిపణులను అడ్డుకోవటమే కాకుండా వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఆపరేషన్ సిందూర్ వేళ ఈ రక్షణ వ్యవస్థ పాకిస్థాన్‌ను కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.