Supreme Court vs Parliament: గత కొద్దిరోజులుగా సుప్రీంకోర్టుపై, న్యాయమూర్తులపై కేంద్రంలోని పెద్దలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కావచ్చు లేదా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కావచ్చు ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇతర న్యాయమూర్తుల్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సైతం తీవ్రంగా ఖండించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు ఈ మద్యన సఖ్యత ఉండటం లేదు. మొన్నటి వరకూ న్యాయ శాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టుపై, కొలీజియం వ్యవస్థపై ఆరోపణలు సంధించారు. ఇప్పుడు ఏకంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ సహా ఇతర బీజేపీ నేతలు సుప్రీంకోర్టును దాదాపుగా బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి అంటే ఇటీవల జరిగిన రెండు పరిణామాల్ని ఉదాహరణగా చెప్పవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పలు తీర్మానాలకు అక్కడి గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తొక్కి పట్టడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గవర్నర్ చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. గవర్నర్ ఆమోదించకుండా పెండింగులో ఉంచిన 10 బిల్లుల్ని తక్షణం ఆమోదించినట్టేనని స్పష్టం చేసింది. గవర్నర్ తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధమైనదిగా తెలిపింది.
ఆ తరువాత తాజాగా వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అధ్యక్షతలోని త్రి సభ్య ధర్మాసనం ఆ చట్టంలోని అంశాలు మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా వక్ఫ్ బోర్టులో ముస్లిమేతరుల్ని ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. దేవాలయాల బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా అని అడిగింది. ఈ అంశంపై తదుపరి విచారణ మే 5న ఉంది.
ఈ రెండు ఘటనలు జరిగినప్పటి నుంచి న్యాయవ్యవస్థపై ఆరోపణలు పెరిగిపోయాయి. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ వంటి నేతలు సైతం న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయమూర్తులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా సూపర్ పార్లమెంటులా తయారయ్యారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ వ్యాఖ్యానించారు. సంపూర్ణ న్యాయం జరిపించేందుకు కోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే 142 ఆర్టికల్ ప్రజాస్వామిక శక్తులపై అణుక్షిపణిలా మారిందని అన్నారు. ఇక బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అయితే దేశంలోని అన్ని అంతర్యుద్ధాలకు కారకుడు అవుతున్నాడంటూ సీజేఐ లక్ష్యంగా దాడి చేశారు. న్యాయవ్యవస్థ ఎప్పుడూ పార్లమెంటుకు లోబడి ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఈ తరహా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్దేశాలకు వ్యతిరేకమైన విషయం. చట్టసభలు రూపొందించిన శాసనాలను సమీక్షించేందుకు, రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయో లేవో సరిచూసేందుకు సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. రాజ్యాంగ సవరణు కూడా మౌళిక స్వభావం పరిధిలో ఉన్నాయా లేవా అనేది సుప్రీంకోర్టు కచ్చితంగా సమీక్షించవచ్చు. అందుకే ఈ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఖండించింది. న్యాయస్థానాల్ని బెదిరించేవిగా, ఒత్తిడి తెచ్చేవిగా ఉన్నాయని తెలిపింది. బీజేపీ నేత నిశికాంత్ దూబేపై అయితే కోర్టు ధిక్కార చర్యల పిటీషన్‌కు అనుమతించాలని అటార్నీ జనరల్‌ను అభ్యర్ధించింది.
Also read: NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









