)
నిర్మల్ జిల్లా అతలాకుతలం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో ముధోల్ నియోజకవర్గంతో పాటు నిర్మల్‌లో భారీ వర్షం పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరుగా వాన పడింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి భారీగా కురిసింది. వర్షం కారణంగా వినాయక విగ్రహ ప్రతిష్టాపన కోసం వేసిన షామియానాలు, మండపాలు తడిసి ముద్దయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డంకిగా వర్షం మారింది.
పోచారం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. వరద ఉగ్రరూపం దాలుస్తుండడంతో పోచారం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం పడుతుండడంతో ఒక లక్ష 15వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలు నిండుకోవడంతో వరద అలుగు పారుతోంది. ఏ క్షణమైనా ప్రాజెక్టుకు ఏదైనా ప్రమోదం సంభవించవచ్చని బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగ ఏర్పడింది. దీని కారణంగా ప్రాజక్టు కుప్పకూలే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహముత్తారం మండలంలోని బోర్ల గూడెం గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గ్రామంలో వరద నీరు వస్తుందని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని నిమ్మగూడెం, పెగడపల్లి గ్రామాల మధ్యనున్న పెద్ద వాగుకు వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో గ్రామాల మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
మానేరు వాగులో చిక్కుకున్న రైతుల కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఫోన్ ద్వారా కలెక్టర్, ఎస్పీకి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. వాగులో చిక్కుకున్న రైతులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎగువ మానేరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడడంతో వివరాలు తెలుసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల క్యాంపుకు చెందిన పంపుకాడి నాగయ్య బర్లను మేపేందుకు బుధవారం వాగు సమీపానికి వెళ్లారు. కురుస్తున్న భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గల్లంతయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. నారాయణఖేడ్ మండలంలోని మద్వార్, హనుమంతరావుపేట గ్రామాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులను బుధవారం పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోని రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని డీఎస్పీ వెంకట్ రెడ్డిని ఆదేశించారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
వరదలో కొట్టుకుపోయిన కారు
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయిన కారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దూకేయడంతో ప్రమాదం తప్పింది. జేసీబీ ద్వారా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కారు నుంచి దూకిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు కాపాడారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు మండల వారి ఇలా ఉన్నాయి
నిజాంసాగర్ 248.8 మీ మీ
పిట్లం 154.4 మీ మీ
పెద్ద కొడప్గల్ 74.0 మీ మీ
జుక్కల్ 18.8 మీ మీ
మద్నూర్ 10.4 మీ మీ
బిచ్కుంద 23.4 మీ మీ
Heavy Rains In Medak District: మెదక్ జిల్లా రామాయంపేటలో భయాందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రామాయంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సుమారు 350 మంది విద్యార్థినులు వరద నీటిలో చిక్కుకుపోయారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యార్థులను బయటకు తీసేకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు
వాగులో చిక్కుకున్న కార్మికులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగుకు భారీగా వరద పోటెత్తింది. ఈ వరదలో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. సహాయం కోసం వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఎదురుచూస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చి కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు.
కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా బిక్నూర్ తలమడ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. ఈ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు మరమ్మత్తు చేపట్టారు.
రంగంలోకి కేంద్ర మంత్రి
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడి తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు. కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని సూచించారు.
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి భారీ వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా వర్షాపు నీరుతో డ్రైన్లు పొంగి రోడ్లపై పారుతుంది. నగరంలోని పాత బస్ స్టేషన్, ఐటీ హబ్, కవిరాజ్ నగర్, టీఎన్జీవో కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షాపు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షం ఆగకపోవడంతో మరింతగా వరద నీరు చేరే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పల్లిపాడు నుండి ఎన్కూర్ వరళ్లే ప్రధాన రహదారి పై వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.
Heay Rains Live Updates: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 గంటలు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్,మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
==> అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతులమవుతోంది. వర్షాలకు మెదక్ లోని సాయినగర్ కాలనీ జలమయమైంది.
==> హవేలీ ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా వద్ద వాగు ఉదృతికి రాకపోకలు నిలిచిపోయాయి.
==> రాజ్ పేట తండా పరిధిలోని కాప్రయపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
==> హావేలిఘనపూర్ మండలంలో పంటపొలాలు నీటమునిగాయి.
==> రేగోడ్ మండలం జగిర్యాలలో వర్షాలకు వాగు పొంగిపొర్లుతోంది.
==> మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేలకొరిగింది. దీంతో ర్యాల మడుగు- మెదక్ కి రాకపోకలు నిలిచాయి.గ్రామంలో విద్యుత్ వైర్లపై భారీవృక్షం పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వర్షం కారణంగా మాజీ సీఎం జగన్ పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో కూడా భారీ వర్షం పడుతుండడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమం రద్దయ్యింది. వినాయకచవితి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గణనాథుడి పూజలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. విజయవాడలో భారీ వర్షం కారణంగా రాణిగారి తోటలో జరిగే గణనాథడి పూజలో జగన్ పాల్గొనాల్సి ఉండగా రద్దయ్యింది.
అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని కారణంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భారీ వర్షాలు: అల్లూరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు
విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
టేక్మాల్‌లో 18.3 సెం.మీ
శంకరంపేటలో 17.6 సెం.మీ
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 17.1 సెం.మీ
పిట్లంలో 15.8
నిజాంపేట్‌లో 15.3 సెం.మీ
భువనగిరిలో 13.2
లింగంపేట్‌లో 12 సెం.మీ
యాదగిరిగుట్టలో 11.7
నాగిరెడ్డిపేట్‌లో 11.6 సె.మీ
మహ్మద్‌నగర్‌లో 10.2
సిరగపూర్‌లో 10 సెం.మీ
కల్హేర్‌లో 9.5
హవేలిఘన్‌పూర్‌లో 9.4 సెం.మీ
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద
14 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో : 1,62,285 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 586.50 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 302.9125 టీఎంసీలు
వర్షాలపై ముఖ్యమంత్రి అప్రమత్తం
Telangana CM High Alert On Heavy Rains: హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి అప్రమత్తం ప్రకటించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుని వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, అల్వాల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో వర్షపాతం వివరాలు
అత్యధికంగా శేరిలింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
రామచంద్రాపురం 3.5 సెం.మీ
కుత్బుల్లాపూర్‌లో 2.9 సెం.మీ
పటాన్‌చెరు 2.9 సెం.మీ
కూకట్‌పల్లిలో 2.7 సెం.మీ
షేక్‌పేట్‌లో 2.4 సెం.మీ
ముషీరాబాద్ 2.3 సెం.మీ
కాప్రాలో 2.3 సెం.మీ
Heavy Rains In Telangana And AP: హైదరాబాద్ మొత్తం మేఘావృతమై కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ పరిసర జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా పరిస్థితి సేమ్ ఉంది. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది.
Rains Live Updates: వర్షాకాలంలో జోరుగా వర్షాలు పడుతుండగా కొన్ని రోజులు విరామం వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ జోరందుకున్న వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో కురుస్తున్నాయి. వినాయకచవితి రోజు భూమిపైకి వినాయకుడితోపాటు గంగమ్మ తోడు వచ్చినట్టు భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌తోపాటు విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలతోపాటు జిల్లాల్లో.. ఏపీలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లకు ఆటంకం ఏర్పడింది. ఉదయం నుంచి వర్షం పడడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. కాగా గణేశ్ చతుర్థి నాడు వర్షం కురవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వినాయకుడి రాకకు సూచికగా భావిస్తున్నారు.