లోకమాన్య తిలక్ ఉగ్రవాద పితామహుడట..!
లోకమాన్య తిలక్‌గా ప్రఖ్యాతిగాంచిన బాలగంగాధర్ తిలక్ ఉగ్రవాద పితామహుడట!
రాజస్థాన్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, లోకమాన్య తిలక్‌గా ప్రఖ్యాతిగాంచిన బాలగంగాధర్ తిలక్ ఉగ్రవాద పితామహుడట! ఈ విషయాన్ని 8వ తరగతి సాంఘిక శాస్త్రం రెఫరెన్స్ బుక్స్‌లో పొందుపరచడం వివాదాస్పదమైంది. ఆయన్ను ఉగ్రవాద పితామహుడు అని ఎలా పిలుస్తారంటూ రాజకీయ నాయకులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఆర్బీఎస్‌ఈ) అనుబంధం ప్రయివేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు బుక్స్‌ను సరఫరా చేసే మధుర పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ముద్రించారు. బాలగంగాధర్ తిలక్ జాతీయ ఉద్యమానికి దిక్సూచీగా నిలిచాడు కాబట్టి.. ఆయనను ఉగ్రవాద పితామహుడిగా పిలుస్తారని సాంఘిక శాస్త్రం రిఫరెన్స్ బుక్‌లోని 22వ అధ్యాయంలో (267 పేజీలో) పొందుపరిచారు. 18, 19వ శతాబ్దంలో జాతీయోద్యమ సమయంలో జరిగిన సంఘటనల కింద పొందుపరచిన సబ్ టాపిక్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
తిలక్‌ను ఉగ్రవాద పితామహుడుగా పేర్కొనడం పట్ల అందరూ ముక్తకంఠంతో ఖండించారు. ఈ పొరపాటుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలను ముద్రించే ముందు ఓసారి చరిత్రకారులను సంప్రదించాలని సూచించారు. తిలక్‌ను ఉగ్రవాద పితామహుడిగా పేర్కొనడం పట్ల కాంగ్రెస్ నేత దిగ్విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని సవరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజస్ధాన్ సీఎం వసుంధర రాజేను ఆయన డిమాండ్ చేశారు.