Pawan Kalyan: తమిళనాడులో పెరిగా.. స్కూల్‌కు విభూతితో వెళ్లేవాడిని: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Fire On Fake Secularists: సనాతన ధర్మం పేరిట తమిళనాడులో సరికొత్త రాజకీయం మొదలుపెట్టిన జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాస్తికులను తప్పుబట్టారు. ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 22, 2025, 09:55 PM IST
Pawan Kalyan: తమిళనాడులో పెరిగా.. స్కూల్‌కు విభూతితో వెళ్లేవాడిని: పవన్‌ కల్యాణ్‌

Muruga Bakthargal Manadu: 'ధర్మం అంటే ఏమిటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మం' అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వివరించారు. 'ఒక పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు? గుజరాత్ లేదా ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు. వారిది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివుడిపై, అమ్మవారిపై కూడా రేపు ప్రశ్నలు వేస్తారు. వారిది చాలా ప్రమాదకరమైన ఆలోచన' అని పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: YS Sharmila: 'జగన్‌ రాక్షసత్వానికి నిదర్శనం సింగయ్య మృతి': వైఎస్‌ షర్మిల

తమిళనాడులోని మధురైలో ఆదివారం నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 'నేను పదహారు ఏటే శబరిమల వెళ్లినవాణ్ణి. థైపూసం సందర్భంగా తిరుత్తణికి భక్తుల పోటును చూశా. విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాడిని' అని తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం?' అని తెలిపారు. 'హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు సూడో సెక్యులరిజం' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: YS Sharmila: ఏ ముఖం పెట్టుకొని ఏపీకి మోడీ వస్తున్నారు? వైఎస్ షర్మిల నిలదీత

'నేను 2014లో హైదరాబాద్‌లో పార్టీ స్థాపించా. నేను తమిళనాడులో పెరిగా, తమిళ సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడిని. తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని. ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదు' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. మురుగన్‌ను నమ్మితే విజయం తథ్యం.. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం అని ప్రకటించారు. 'మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది. మన జీవితాన్ని మధురంగా మార్చుతుంది' అని వివరించారు.

ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరి వాటంతట అవే పరుగు తీస్తాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. అలాగే మన శత్రువులు ఎంత మంది ఉన్నా మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసే పారిపోతారని పేర్కొన్నారు. 'అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బతు ఇల్లయే అనే మహాకవి భారతీయర్  మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి. కష్టాన్ని ఆపేస్తే కాలం నడక ఆపదు. అలానే, కొందరి కుత్సిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు. ఆ ధర్మం నడుస్తూనే ఉంటుంది' అని ప్రకటించారు.

'ప్రపంచపు తొలి విప్లవ నాయకుడు మురుగన్. మురుగన్‌కు బేధభావం లేదు. అందరూ సమానమే. మధురైలో పార్వతి దేవి స్వరూపం మీనాక్షీ అమ్మవారు. శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు ఇక్కడే కొలువై ఉన్నారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది, ఆరవది ఈ ప్రాంతంలోనే ఉంది' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వివరించారు. 'ఈ తరం వారు మధురై గురించి తెలుసుకోవాలి. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం. మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News