ఉవ్వెత్తు ఎగసిన నిరసన జ్వాలలు;  గాడ్సేను దేశభక్తుడని చెప్పినందుకు సారీ చెప్పిన సాధ్వి !!

ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా సాధ్వి వ్యాఖ్యలను తప్పబట్టడంతో ఆమె దిగిరాక తప్పలేదు.

Updated: May 16, 2019, 08:54 PM IST
ఉవ్వెత్తు ఎగసిన నిరసన జ్వాలలు;  గాడ్సేను దేశభక్తుడని చెప్పినందుకు సారీ చెప్పిన సాధ్వి !!

మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ వినాయక్ గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన బీజేపీ నేత భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వెనక్కి తగ్గారు.  ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే ఆమె క్షమాపణలు తెలిపారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ ఆమె ఈ వ్యాఖ్యాలు చేయాల్సి వచ్చింది. 

ఉవ్వెత్తు ఎగసిన నిరసన జ్వాలలు
గాడ్సేను దేశభక్తుడన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్  వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆమె వ్యాఖ్యల్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా దీన్ని తీవ్రంగా ఖండించగా.. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలా దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు సాధ్వి వ్యాఖ్యలను తప్పుబడుతూ గళం ఎత్తాయి.

బీజేపీ నష్టనివారణ చర్యలు...
సాధ్వి వ్యాఖ్యలు ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన బీజేపీ అధిష్టానం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. సాధ్వి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. ఆమెను వివరణ కోరనున్నట్టు ఆ పార్టీ నేత జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు.  మహాత్మాగాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడు కాలేడని మధ్యప్రదేశ్ బీజేపీ నేత లో కేంద్ర పరాశర్ స్పష్టం చేశారు. అటు ప్రతిపక్షాలు ఇటు సొంత పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలను తప్పబట్టడంతో సాధ్వి దిగిరాక తప్పలేదు.