బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ చేయకపోతే సేలరీ ఆపేస్తారా.. ఎంత ధైర్యం: ప్రభుత్వ సంస్థకు హైకోర్టు చీవాట్లు
ముంబయి పోర్టు ట్రస్టులో ఛార్జిమన్‌గా పని చేస్తున్న రమేష్ పురాలే అనే వ్యక్తిని సంస్థ యాజమాన్యం 2016లో జీతాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్యాంకు అకౌంట్ వివరాలు కోరింది.
ముంబయి పోర్టు ట్రస్టులో ఛార్జిమన్‌గా పని చేస్తున్న రమేష్ పురాలే అనే వ్యక్తిని సంస్థ యాజమాన్యం 2016లో జీతాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్యాంకు అకౌంట్ వివరాలు కోరింది. అలా వివరాలు అడుగుతూనే.. ఆధార్ కార్డు నెంబరును కూడా బ్యాంకు ఖాతాకి లింక్ చేయాలని కోరింది. అలా సేలరీ ఖాతాకీ ఆధార్ నెంబరు లింక్ చేస్తేనే.. జీతం క్రెడిట్ అవుతుందని... లేకపోతే క్రెడిట్ అవ్వదని సంస్థ తెలిపింది. అయితే రమేష్ బ్యాంకు ఖాతాకి ఆధార్ సంఖ్య లింక్ చేయలేదు. ఇంకేముంది.. ఆయన ఖాతాలో జీతం పడలేదు.
అయితే ఆధార్ సంఖ్య బహిర్గతం చేయాలా? వద్దా? అనేది తన ప్రైవసీకి చెందిన విషయమని.. కేవలం ఆధార్ నెంబరు లింక్ చేయకపోతే జీతం నిలిపివేయడం ఏమిటని రమేష్ సంస్థకు ఫిర్యాదు చేశారు. అయితే సంస్థ యాజమాన్యం.. అది తమ సంస్థతో పాటు బ్యాంకు నిబంధన అని.. ఆధార్ సంఖ్య లింక్ చేయకపోతే తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో రమేష్ సంస్థ పై కోర్టులో పిటీషన్ ఫైల్ చేశారు. ఆ పిటీషన్ ఫైల్ చేస్తూ సెప్టెంబరు 26వ తేదిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి కూడా తెలిపారు.
తాజాగా సోమవారం ఈ కేసును విచారించిన ముంబయి హైకోర్టు.. పోర్టు ట్రస్టు యాజమాన్యంతో పాటు ఆ సంస్థ ఏ శాఖ పరిధిలోకి వస్తుందో.. ఆ శాఖ అధికారులపై కూడా మండిపడింది. "మీరు మీ ఇష్టం వచ్చినట్లు స్టాండ్ తీసుకోవడం కుదరదు. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకి లింక్ చేయకపోతే జీతం ఆపేస్తారా? ఎంత ధైర్యం మీకు? ఈ విషయం చాలా విడ్డూరంగా ఉంది? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరూ తమ ఆధార్ వివరాలు బహిర్గతం చేయనవసరం లేదు. వెంటనే ఆ వ్యక్తికి రావాల్సిన జీతాన్ని మొత్తం వడ్డీతో సహా, ఎరియర్స్‌తో సహా చెల్లించండి" అని తెలిపింది. ఈ కేసు విషయమై ఫైనల్ హియరింగ్ జనవరి 8, 2019 తేదిన ఉంటుందని కూడా కోర్టు పేర్కొంది.