చిప్కో ఉద్యమం పేరు విన్నారా..? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ పర్యావరణ సమాజానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉద్యమం అది. చెట్లను కౌగలించుకొని.. వాటికీ జీవముంటుందని.. అవి కూడా ప్రాణమున్న జీవాలే అని లోకానికి చాటిన ఉద్యమం అది. ఆ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చినవారే బిష్ణోయిలు. క్రీ.శ 1730లో జోధ్‌పూర్ మహారాజు అభయ్ సింగ్ ఓ పెద్ద కట్టడం కట్టే యోచనలో ఉండి.. చెక్కపనికి అవసరమైన ఖేజర్లీ చెట్లను నరుక్కురమన్నాడు. రాజు చెప్పినట్లు అటవీ ప్రాంతానికి వెళ్లారు సైనికులు. కానీ ఆ అడవిలో చెట్లను నరకడానికి సుతరామూ ఒప్పుకోలేదు అక్కడ నివసించే బిష్ణోయిలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజు ఆ బిష్ణోయిలను చంపి చెట్లను నరుక్కురమన్నాడు. వెంటనే మూడు వందలమంది బిష్ణోయిలు వచ్చి ఆ చెట్లను కౌగలించుకున్నారు. వాటితో పాటే సైనికుల గొడ్డళ్లకు బలైపోయారు. ఆ తర్వాత వీరి కథ ఎన్నో పర్యావరణ ఉద్యమాలకే స్ఫూర్తినిచ్చింది. తాజాగా సల్మాన్ ఖాన్ జింకలను వేటాడి చంపిన కేసులో కూడా బిష్ణోయిలే ప్రధాన పాత్ర పోషించారు. 


జాంబేశ్వరుడి స్ఫూర్తితో..
గౌతమబుద్ధుడిలాగే, వర్థమాన మహావీరుడిలాగే అహింసను బోధించిన గురువు జాంబేశ్వరుడు. ఆయనను గురువుగా, దైవంగా పూజించే బిష్ణోయిలు 29 నియమాలను పాటిస్తారు. ఆ నియమాల ప్రకారం వారు చెట్లను నరకరాదు. అలాగే పశుపక్ష్యాదులను చంపరాదు. పైగా అలాంటి చర్యలను ప్రతిఘటించాలి. బిష్ణోయిల స్ఫూర్తితోనే 1973లో చమోలి జిల్లా (ఉత్తరాంచల్) లోని గోపేశ్వర్‌లో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది.


చెట్లను నరకమని యూపీ అటవీశాఖ సైమన్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినప్పుడు బిష్ణోయ్ తెగకు చెందిన మహిళలు అడవి సత్యాగ్రహం చేశారు.  1970 దశకంలో సుందర్‌లాల్ బహుగుణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఊపందుకుంది. చండీప్రసాద్ భట్ అనే మరో పర్యావరణ ప్రేమికుడు ఆయనకు సహకరించడంతో ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పర్యావరణ ఉద్యమంగా మారింది. ఫలితంగా 15 ఏళ్ళ పాటు ఆయా ప్రాంతాల్లో చెట్ల నరికివేతను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టాలు తయారుచేసింది. ఇదే ఉద్యమం ఇతర రాష్ట్రాలలో ఉద్యమాలకూ ప్రేరణగా నిలిచింది.



సల్మాన్ ఖాన్ కేసులో బిష్నోయిల పాత్ర..
సల్మాన్ ఖాన్ అటవీ ప్రాంతానికి వచ్చి నల్ల జింకలను కాల్చినప్పుడు.. ఆయనపై కేసు పెట్టే క్రమంలో బిష్ణోయిలు ప్రధాన పాత్ర పోషించారు. రాజస్థాన్ హైకోర్టు తగిన ఆధారాలు లేవని కేసును కొట్టివేస్తే.. బిష్ణోయిలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. జింకలను క్రూరంగా వేటాడి హతమార్చిన సినీనటుడు సల్మాన్‌కు గరిష్ఠ శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహిపాల్ బిష్ణోయ్ వాదనలు వినిపించారు.


వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్ 9/51 ప్రకారం సల్మాన్‌ ఖాన్‌ను కోర్టు దోషిగా పరిగణించింది. అతనికి 5 సంవత్సరాలు కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. 52 మంది సాక్షుల్లో 26 మంది సల్మాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడంతో పాటు..  బిష్ణోయ్ గిరిజనులు ఐకమత్యంగా పోరాటం సాగించిన ఫలితంగానే సల్మాన్‌కు కారాగార శిక్ష పడిందని తెలుస్తోంది.