ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ సీనియర్‌ నేత టీఎస్‌ సింగ్ డియో ఈ రోజు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 15 సంవత్సరాలుగా ఛత్తీస్ ఘడ్‌లో తమ పార్టీ అధికారంలో లేదని చెప్పిన ఆయన.. ఈ సారి మాత్రం ప్రతిపక్షాలను కంగుతినిపించడం ఖాయమని అన్నారు. సీతాదేవి ఏ విధంగా రాముడిని స్వయంవరం ద్వారా వరుడిగా స్వీకరించిందో.. అలాంటి స్వయంవరమే ఏర్పాటు చేసి ఈ సారి తాము సీఎంని ఎన్నుకుంటామని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఒకవేళ మా పార్టీ గెలిస్తే.. అంతర్గత కలహాలకు చోటు ఇవ్వకుండా.. ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కోసం స్వయంవరం లాంటిది ఏర్పాటు చేస్తాం. ఎక్కువమంది మద్దతిచ్చే వ్యక్తే సీఎం అవుతారు. అంతేగానీ..ముందుగానే మేము సీఎం అభ్యర్థిని ప్రకటించము" అని డియో తెలిపారు. అలాగే ఈ సారి కాంగ్రెస్ సర్కారును ఏర్పాటు చేయడానికి మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమేనని డియో అన్నారు. 2003 ఎన్నికల తర్వాత కూడా బీజేపీ పార్టీ ఎప్పుడూ తమ సీఎం అభ్యర్థిగా రమణ్‌ సింగ్‌ని ప్రకటించలేదని డియో గుర్తుచేశారు. 


యూపీలో కూడా ఎన్నికల తర్వాతే బీజేపీ సీఎంగా ఆదిత్యనాథ్‌ని ప్రకటించిందని.. అదే విధంగా తాము కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మాట్లాడతామని.. అప్పుడే తమ సీఎం ఎవరో ప్రకటిస్తామని డియో తెలిపారు. ఎన్డీఏ పాలన తనకు ఏ విధంగానూ ఆమోదయోగ్యంగా కనబడడం లేదని.. ప్రభుత్వం తమను వ్యతిరేకించేవారినందరినీ శత్రువులుగా చూస్తోందని.. వారిని దేశద్రోహులుగా ప్రచారం చేస్తుందని.. బీజేపీ ఆ పద్ధతి మానుకోవాలని డియో అన్నారు. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్ ఘడ్‌లో ఈ సంవత్సరాంతంలో ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.