పరువు హత్యలు: ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు
పరువు హత్యలు: ప్రాణంతోనే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు
ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇంట్లోంచి వెళ్లిపోయిన ఓ ప్రేమ జంటను వెతికిపట్టుకున్న యువతి తల్లిదండ్రులు.. ప్రాణం ఉండగానే వారిని కాళ్లు, చేతులు కట్టేసి నదిలో పడేసిన ఘటన కర్ణాటకలోని మాండ్యకు సమీపంలోని శివనాసముద్రలో చోటుచేసుకుంది. మొదట గురువారమే ఓ యువకుడు కావేరి నదిలో నీళ్లపై శవమై తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే మరో రెండు రోజులకు అదే నదిలో అదే చోట మరో యువతి శవమై తేలడంతో మాండ్య పోలీసులు తమదైన స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. ఆ యువతి, యువకుడి శవాలు కాళ్లు, చేతులు కట్టేసి ఉండటం గమనించిన పోలీసులు.. ఈ ఇద్దరినీ ఒక్కరే, ఒక్కసారే పరువు హత్య చేసి ఉంటారనే అభిప్రాయానికి వచ్చేశారు. ఆ సందేహంతోనే దర్యాప్తు చేపట్టిన అనంతరం దర్యాప్తులో భాగంగా మాండ్య పోలీసులు నందీశ్, స్వాతి శవాలకు సంబంధించిన ఫోటోలను కర్ణాటకతోపాటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు సైతం పంపించారు. దీంతో వారికి ఓ క్లూ దొరికింది. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు హత్యకు గురైన ఆ ఇద్దరినీ తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా చుడగౌండనహల్లికి చెందిన నందీష్ (26), యువతి స్వాతి (19) అని గుర్తించారు.
ప్రేమ జంట జీవితాన్ని మలుపు తిప్పిన కమల్ హాసన్ బహిరంగ సభ :
నందీష్ తక్కువ కులానికి చెందిన వాడనే ఆగ్రహంతో స్వాతి తండ్రి వీళ్ల పెళ్లికి అంగీకరించలేదు. ఇరు కుటుంబాలు తమ పెళ్లికి అంగీకారం తెలపకపోవడంతో మూడు నెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన నందీష్, స్వాతి తమిళనాడులోని హోసూరులో కాపురం పెట్టారు. మూడు నెలలపాటు అంతా సవ్యంగానే సాగింది. అయితే, ఇటీవల నవంబర్ 10న ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ హాజరైన ఓ బహిరంగ సభకు నందీష్, స్వాతి ఇద్దరూ హాజరయ్యారు. ఇదే బహిరంగ సభకు హాజరైన స్వాతి దూరపు బంధువు ఒకరు అక్కడ నందీష్, స్వాతిలను చూసిన విషయాన్ని వెంటనే స్వాతి తండ్రి శ్రీనివాసకు ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రేమ జంట కోసం వెతుకుతూ హోసురుకే వచ్చిన శ్రీనివాస.. తమ దూరపు బంధువు ఇచ్చిన సమాచారం మేరకు తన గ్యాంగ్ తో అక్కడ వాలిపోయాడు.
కమల్ హాసన్ సమావేశం ముగిసి ఎక్కడి వాళ్లు అక్కడ వెళ్లిపోయే సమయానికి ప్రేమ జంటను చుట్టుముట్టిన స్వాతి తండ్రి మనుషులు.. అక్కడే ఆ ఇద్దరితో వాగ్వీవాదానికి దిగారు. విషయాన్ని పోలీసు స్టేషన్‌లోనే తేల్చుకుందాం అని ఆ ప్రేమ జంటను వాహనం ఎక్కించుకున్న శ్రీనివాస.. వారిని పోలీసు స్టేషన్‌కి కాకుండా శివనాసముద్రకు తీసుకెళ్లారు. అణగారిన వర్గానికి చెందిన యువకుడివి అయ్యుండి, అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ అక్కడే ఆ యువకుడిని చితకబాదారు. తెల్లవారు జామున 3 గంటలకు స్వాతి చూస్తుండగానే ఆమె కళ్లముందే నందీష్ కాళ్లు, చేతులు కట్టేసి కావేరి నదిలో పడేశారు. నందీష్ ని నదిలో పడేసిన కొద్ది నిమిషాలకే స్వాతిని సైతం ఆమె చున్నితోనే కాళ్లు, చేతులు కట్టేసి నదిలో పడేశారు.
నిజం అంగీకరించిన స్వాతి తండ్రి శ్రీనివాస:
నందీష్, స్వాతి ఇద్దరూ క్రిష్ణగిరి జిల్లాకు చెందిన వారు అని తెలుసుకున్న మాండ్య పోలీసులు నేరుగా వెళ్లి స్వాతి తండ్రి శ్రీనివాసను అరెస్ట్ చేశారు. విచారణలో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పిన శ్రీనివాస పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు. శ్రీనివాసపై పరువు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. నందీష్, స్వాతి హత్యలో శ్రీనివాసకు సహకరించిన అతడి బంధువులు, అనుచరుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.