
RTC Buses Bandh: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, డిమాండ్లపై రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. కొన్ని నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. 38 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలతో సమానంగా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో రేపు అంటే మంగళవారం ఆర్టీసీ కార్మికులు బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేసి సమ్మెలో పాల్గొననున్నారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
రాష్ట్ర రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగుల సమ్మె తీవ్రమైంది. రేపు ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వ బస్సులు రోడ్లపైకి కనిపించవు. హైకోర్టు మరోసారి సమ్మెను వాయిదా వేయాలని ఆదేశించినా.. ఉద్యోగులు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరసన ప్రారంభం కానుంది. సమ్మె ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండనుంది. రాజధాని బెంగళూరుతోపాటు మైసూరు, బళ్లారి తదితర ప్రధాన నగరాల్లో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించనుంది. సమ్మెతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగనుంది.
ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదు. ఉద్యోగులు సంతృప్తి చెందకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం చేసిన చర్చలు తమకు సంతృప్తికరంగా లేకపోవడంతో రవాణా ఉద్యోగులు యథావిధిగా సమ్మె చేపట్టనున్నారు. చర్చలు విఫలమవడంతో రేపు ఆర్టీసీ సంస్థలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. 'ఎవరైనా సమ్మెలో పాల్గొంటే క్రమశిక్షణా చర్యలు తప్పవు' అని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. విధులకు హాజరుకాని ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమని ఆర్టీసీ స్పష్టం చేసింది.
తీవ్ర ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా సమ్మెలో పాల్గొనుండడంతో ఆర్టీసీ సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు నుంచి రోజువారీ ప్రయాణికులు అందరికీ తీవ్ర అంతరాయం కలగనుంది.
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు ఇవే!
==> ప్రధానంగా 38 నెలలుగా జీతాలు చెల్లించలేదు. బకాయిపడిన వేతనాలు తక్షణమే చెల్లించాలి
==> ఇచ్చే చాలీచాలని జీతం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇవ్వాలి
==> ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు విరమించుకోవాలి.
==> ఆర్టీసీలో అవినీతితోపాటు కార్మికులపై వేధింపులు ఆపాలి
==> ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లకు అందరికీ నగదు రహిత వైద్య సౌకర్యం అందించాలి
==> ఆయా డిపోలు, బస్స్టేషన్లలో ఉద్యోగులకు నాణ్యమైన క్యాంటీన్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
==> 2020, 2021లో చేపట్టిన సమ్మె సందర్భంగా ఉద్యోగులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి
==> ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి కంపెనీ డ్రైవర్లను కేటాయించాలి.
==> ఈ-బస్సుల నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతిని విరమించుకోవాలి.
వర్క్ ఫ్రమ్ హోమ్
సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఉద్యోగులు సాధ్యమైనంతగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించింది. ప్రజలకు, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను బస్సులు నడపాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ప్రైవేట్ బస్సులు నడపాలని కోరగా.. ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో సమ్మె ప్రభావం తగ్గించడానికి ఆగస్టు 5వ తేదీ నుంచి ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతివ్వాలని కంపెనీలకు ప్రభుత్వం ఆదేశం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.