Waqf Amedement Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లు-2025 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందింది. అర్థరాత్రి దాటే వరకూ చర్చ జరిగిన తర్వాత రాజ్యసభ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు.. వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దాదాపు 14 గంటల చర్చల తర్వాత లోక్‌సభలో బిల్లును ఆమోదించగా రాజ్యసభ సైతం అర్థరాత్రి దాటే వరకూ చర్చించి ఆమోదం తెలిపడం విశేషం. . కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు ఇస్లామ్ కు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం గవర్నమెంట్ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో ముస్లిం మహిళలను సెకండ్ గ్రేడ్ పౌరులుగా మార్చాయని బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తీవ్రంగా తూర్పార పట్టారు. వారి హక్కులను గుర్తించలేదన్నారు. వక్ఫ్ ఆస్తులను తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వాటిని దుర్వినియోగం కాకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ బిల్లు తెచ్చిందన్నారు.
రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు.ముస్లింలను సెకండ్ గ్రేడ్ పౌరులుగా పరిగణించేలా బిల్లు ఉందని ఆరోపించారు. కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన యూబీటీ, వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు బీజేపీ యత్నిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మతసామరస్యాన్ని దెబ్బతీయవద్దని బిల్లును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అర్థరాత్రి దాటిన తర్వాత చర్చకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి రిజిజు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్నసందేహాలకు సమాధానమిచ్చారు. కౌన్సిల్‌లోని 22 మంది సభ్యులలో ఎక్స్‌అఫీషియో సభ్యులతో సహా నలుగురుకు మించి ముస్లిమేతరులు ఉండరని తెలిపారు. ఇతర మతాలకు చెందిన ముగ్గురు ఎంపీలు, ఇద్దరు మహిళలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో సభ్యులుగా నియమితులవుతారని వెల్లడించారు. తద్వారా ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు. వక్ఫ్‌బోర్డు వంటి చట్టబద్ధ సంస్థలు సెక్యులర్‌గా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
వాడీవేడి చర్చ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ ఆధారంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ బిల్లును ఆమోదించారు. దిగువ,ఎగువ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం వల్ల రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









