11 రాష్ట్రాల్లో ఓడిన కాంగ్రెస్, 11 సీట్లు గెలిస్తే పండగా : అమిత్ షా
11 రాష్ట్రాల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు గెలిచి పండగ చేసుకుంటోంది అని ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.
11 రాష్ట్రాల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు గెలిచి పండగ చేసుకుంటోంది అని ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఏ కారణం, విజయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది అని కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు షా. ప్రముఖ మీడియా సంస్థ జీ మీడియా గ్రూప్ శనివారం నిర్వహించిన జీ ఇండియా కాన్‌క్లేవ్‌లో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమవడాన్ని బీజేపీ ఎలా భావిస్తుంది అని జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సుధీర్ చౌదరి సంధించిన ప్రశ్నకు స్పందిస్తూ.. "బీజేపీకి 2019 ఎన్నికలు ఏమీ చివరి ఇన్నింగ్స్ కావు" అని అన్నారు. "ఒకప్పుడు ఇంధిరా గాంధీ వర్సెస్ అన్ని పార్టీలు అనే పరిస్థితి వుండేది కానీ ఇకపై వచ్చే ఎన్నికలు అన్నింటిలో ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ ఆల్ పార్టీస్ అనేవిధంగానే వుంటుంది" అని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ గురించి అమిత్ షా మాట్లాడుతూ.. " యూపీలో యోగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ అట్టడుగువర్గాల వరకు చేరుతున్నాయి" అని అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా యూపీలోనే పరిపాలన బాగుంది అని యోగి ఆదిత్యనాథ్ సర్కారుకి అమిత్ షా కితాబు ఇచ్చారు.