Vanlife With Ravi Success Journy: యాత్ర అనేది ఎంతో కఠిన శ్రమతో కూడుకొని ఉంటుంది. ఎన్నో రకాల ప్రమాదాలను తట్టుకుంటూ.. కష్టాలను దాటుకుంటూ.. సాగే అద్భుతమైన ప్రయాణమే జీవితానికి ఆనందాన్ని అందిస్తుంది.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పకుండా జీవితంలో ఒకసారైనా అడ్వెంచర్‌తో కూడిన టూర్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆర్థిక పరిస్థితులు, మన చుట్టూ ఉండే సమాజం, కుటుంబ పరిస్థితులను ఆలోచించి ఆగిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే వారు అనుకున్నది అనుకున్నట్టుగా చేసి.. చివరికి యాత్రలో భాగంగా గమ్యాన్ని చేరుకుంటూ ఉంటారు. కరోనా కష్టకాలం నుంచి బయటపడిన తర్వాత సోషల్ మీడియా వినియోగం పెరగడంతో చాలామంది యూట్యూబర్స్ ప్రపంచంలో ఉండే సాహసోపేతమైన యాత్రలను చేస్తూ వాటిని నెటిజన్స్‌కి కళ్లకు కట్టినట్లు చూపెడుతున్నారు. మరికొంతమంది అయితే సైకిల్‌తో దేశాలను చుట్టేస్తూ సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువ యూట్యూబ్ వ్యాన్ యాత్రతో గొప్ప ప్రశంసలు పొందుతున్నారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి వీడియో ఇప్పుడు లక్షల వ్యూస్ అందుకుంటున్నాయి.
మనం ఇప్పటికీ అనేక రకాల యాత్రలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసి ఉంటాం.. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన రవి (VanLife With Ravi) అనే యూట్యూబ్ తన మినీ వ్యాన్‌తో చేస్తున్న యాత్ర చాలా ప్రత్యేకం.. లండన్‌లో ఉన్నత విద్యలను అభ్యసించిన అతడు అక్కడే రెండున్నర సంవత్సరాల పాటు గడిపారు.. అంతేకాకుండా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత అతను చేయాలనుకున్నది ఉద్యోగం కాదని.. జీవితంలో గుర్తుండిపోయేలా ఇంకేదో చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే వ్యాన్ టూర్ ప్రారంభించాడు. అతడికి పర్యటనలపై ఉన్న ఆసక్తితో మంచి ఉద్యోగాన్ని వదులుకొని తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. మొదట ఆయన లండన్‌లో ఉద్యోగం చేసే క్రమంలో వ్యాన్ లైఫ్ గురించి ఎన్నో తెలుసుకున్నాడు. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా అక్కడ ఉండే కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించే వాడట. సొంత దేశం వచ్చాక కూడా ఇదే తరహాలో యాత్రలు చేద్దామని అనుకున్నాడు. మొదట ఉద్యోగం చేసినప్పటికీ.. ఏమాత్రం నచ్చకపోవడంతో వ్యాన్ లైఫ్ విత్ రవిగా మారాడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతనికంటూ ఒక మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రవి తన వ్యాన్ యాత్ర ద్వారా సోషల్ మీడియా ద్వారా కొన్ని లక్షల మందికి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.
ఇక్కడి నుంచే ప్రారంభం..
రవి డ్యూటీలో ఉన్నప్పుడే భారతదేశం మొత్తం వ్యాన్ ద్వారా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఉద్యోగం చేసిన డబ్బులు అన్నిటిని పొదుపు చేసుకున్నాడు. మొదటగా ఉద్యోగం మానేసిన వెంటనే అతడు తన సేవింగ్స్ లోనుంచి రూ.6.5 లక్షలు ఖర్చు చేసి ఒక మినీ మారుతి ఈకో వ్యాన్ కొనుగోలు చేశాడు.. ఆ తర్వాత యాత్రలో భాగంగా తనకు అవసరమైన రీతిలో వ్యాన్‌ను మాడిఫై చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే గుజరాత్కు వెళ్లి రూ.3.5 లక్షలు ఖర్చుపెట్టి.. తన మినీ వ్యాన్ ను తనకు నచ్చినట్లుగా మాడిఫై చేసుకున్నారు. ఈ మొత్తం వ్యాన్‌కు గాను ఖర్చు రూ.10 లక్షలు అయింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మేరకు జనవరి ఒకటో తేదీ 2024 సంవత్సరంలో తన మొదటి వ్యాన్ టూర్ను ప్రారంభించాలనుకున్నారు. మొదట కన్యాకుమారి వైపు వెళ్లాలని రూల్స్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగానే రవి తన మొదటి వ్యాన్ టూర్‌ను కన్యాకుమారికి ప్రారంభించారు.
సోషల్ మీడియా ప్రోత్సాహం..
రవి (VanLife With Ravi) తన మొదటి వ్యాన్ టూర్ కన్యాకుమారికి 2024 సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ సమయంలో రవి తన సోషల్ మీడియా ద్వారా వస్తున్న ప్రోత్సాహాలను అందుకుంటూ ముందుకు సాగాడు. మొదటగానే అతడు ఒక సంవత్సరం పాటు సోషల్ మీడియా ద్వారా ఎలాంటి రెవిన్యూను ఆశించలేదు. తను చేస్తున్న ప్రయాణంలో భాగంగా అతను సోషల్ మీడియాలో అనేక వీడియోలను పోస్ట్ చేసేవారు. తెలుగులో వ్యాన్ టూర్ చేస్తున్న ఏకైక వ్యక్తి రవి కావడంతో అతడి కంటెంట్ జనాలకు ఎంతో బాగా నచ్చేసింది.. దీంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అతడికి ఫాలోవర్స్‌గా మారారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో పోస్ట్ చేసిన వైరల్ అవుతూనే వస్తోంది.
మొదట తొమ్మిది రోజుల్లోనే అతడి (VanLife With Ravi) ఇన్స్టాగ్రామ్ ఖాతాను లక్షమంది ఫాలో చేయడం రవికి మంచి బూస్ట్ నందించింది. అంతేకాకుండా వ్యాన్ టూర్ స్టార్ట్ చేసిన 28 రోజుల్లోనే యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా రెవెన్యూ రావడం ప్రారంభమైంది. ప్రతిరోజు అద్భుతమైన కంటెంట్ అందించడంతో నెటిజన్స్ కూడా సోషల్ మీడియా అకౌంట్స్‌ను పెద్ద ఎత్తున ఫాలో అవుతూ వచ్చారు. అంతేకాకుండా రవికి ఇక్కడి నుంచి వ్యాన్ లైఫ్ టూర్ పై మంచి అవగాహన కూడా ఏర్పడింది. ఇప్పుడు అతడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వివిధ రకాల బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా రవి తన ఖర్చులకు డబ్బులు సరిపోయే విధంగా సమయం దొరికినప్పుడల్లా ఫ్రీ లాన్సింగ్ వీడియో ఎడిటింగ్ కూడా చేస్తున్నారు.
వ్యాన్ లైఫ్..
వ్యాన్ లైఫ్ అంటే ఎంతో కష్టమని అందరికీ తెలిసిందే.. కానీ రవి ఈ కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. వ్యాన్‌లోనే జీవితం గడిపేందుకు ఇష్టపడే ఆయన, 24 గంటల పాటు అందులోనే ఉండేందుకు వివిధ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆహారం నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని వ్యాన్‌లోనే ఉండేటట్లు చూసుకున్నారు. వ్యాన్ లోనే ఒక సంవత్సరం పాటు భారత్ మొత్తం చుట్టేస్తూ రికార్డ్ సృష్టించాడు. అయితే ఒకానొక సమయంలో రవికి అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక చేదు అనుభవం ఎదురయింది.. అరుణాచలంలోని కొంతమంది అల్లరి మూకలు అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రవి ఏమాత్రం భయపడకుండా వారి నుంచి తప్పించుకున్నారు. తన తప్పేమీ లేకున్నా తనపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అతడు దానిని ముందుగానే అర్థం చేసుకొని అక్కడి నుంచి వెంటనే ఇతర చోటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి అతడు ముందుగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం సాగించారు.
ఇంటర్నేషనల్ వ్యాన్ టూర్..
మొదటి ట్రిప్ కంప్లీట్ అవ్వగానే రవికి వ్యాన్‌తో పాటు ఇంటికి తిరిగివచ్చారు.. ఒక నెలపాటు తన ఫ్యామిలీతో సరదాగా గడిపి.. ఇంటర్నేషనల్ వ్యాన్ టూర్‌కి ప్లాన్ చేసుకున్నాడు. మొదటి యాత్ర ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని, ఈ అంతర్జాతీయ యాత్రను ప్రారంభించాలనుకున్నారు.. అనుకున్నది అనుకున్నట్టుగానే రవి తన మొదటి ఇంటర్నేషనల్ టూర్ నేపాల్‌కి ఫిబ్రవరి 1వ తేదీన వ్యాన్ టూర్‌ని ప్రారంభించాడు. నేపాల్‌లో ఉండే వివిధ అందమైన ప్రదేశాలు ముక్తినాథ్, పోఖారా, ఖాట్మండు ఎక్స్ప్లోర్ చేసి సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకున్నారు. దాదాపు రెండు వారాలపాటు సాగిన ఈ యాత్ర రవికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించింది. ఆ తర్వాత నేపాల్ నుంచి బయలుదేరి కోయంబత్తూరులోని ఆదియోగిలో జరిగే శివరాత్రి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఇంటర్నేషనల్ టూర్‌లో భాగంగా అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. తన ఫాలోవర్స్ సహాయంతో మునుముందు మరెన్నో ఇంటర్నేషనల్ టూర్లను చేయబోతున్నట్లు రవి చెబుతున్నారు. ఏది ఏమైనా ఎంతో కష్టంతో కూడిన వ్యాన్ యాత్ర ద్వారా మన తెలుగు యువకుడు వివిధ రాష్ట్రాలతో పాటు దేశాలను ఎక్స్ప్లోర్ చేయడం చాలా గ్రేట్..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









