)
Telangana Divorce Trends: వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా..అందుకే ఇవ్వరా విడాకులే బెస్ట్ రా..ఇప్పుడు నగరంలో నయా ట్రెండ్ ఇదే. అంతే తమ్ముడు.. నేనైతే.. అసలే పెళ్లే వద్దంట ..ఇంకా విడాకులు ఎందుకు సమయం దండగా అంటున్నారు.. అసలు పెళ్లి అనే మాటే ఎత్తకండి.. ఇలా సింగిల్ ఉండటే లైఫ్ హ్యాపీ అని మరికొందరు అంటున్నారు. పెళ్లి చేసుకున్న కొంత కాలానికే విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య హైదరాబాద్ నగరంలో భారీగా పెరిగిపోతంది. మార్కెట్లో విస్తరాకులు అమ్మినంత ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. సర్దుకపోవడం రాక, ఎందులో తక్కువనే భావన..అనవసర విషయాల్లో పెద్దల జోక్యం కూడా ఈ పరిస్థితికి కారణమని న్యాయ నిపుణులు సైతం అంటున్నారు.
భారతదేశం అంటే సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపుగా పేరుపొందింది. వివాహం అంటే కుటుంబాలు కలవడం, అనుబంధాలు బలపడటం అనే భావన బలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి అంటేనే నరకంలా భావిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అవును నిజమే..హైదరాబాద్ మహానగరంలో విడాకుల కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మూడు మూళ్లు, మూడ్నాళ్ల ముచ్చటే అనే సామేతను గుర్తు చేసేలా..చాలా మంది జంటలు పెళ్లి చేసుకున్న మూడు నెలలు తిరగకుండా విడాకులకు అప్లయ్ చేసుకుంటున్నారు.
అసలు విడాకులు తీసుకునేందుకు కారణం ఏంటి? జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నగర జీవితం వేగంగా మారిపోతోంది. ఉద్యోగ ఒత్తిడి, నైట్ షిఫ్టులు, వ్యక్తిగత సమయానికి తగినంత స్థలం లేకపోవడం దంపతుల మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి. ఆన్లైన్ యుగంలో కొత్త పరిచయాలు కూడా దంపతుల మధ్య విడాకుల కారణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మహిళ్లలో ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది. వారిలో అంచనాలు భారీగా పెరిగాయి. చదువులో, ఉద్యోగంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇది మంచి విషయం అయినప్పటికీ, ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిన కొద్దీ సంబంధాల్లో ‘నేనే ఎందుకు తట్టుకోవాలి?’ అన్న ఆలోచన బలపడుతోంది. అదనంగా, ఒకరిపై మరొకరు అతి ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల చిన్న విషయమే పెద్ద గొడవలకు దారితీస్తోంది.
విడాకుల పెరుగుదలలో ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్ లోపం. దంపతులు ఒకరితో ఒకరు సమస్యలు పంచుకోవడం తగ్గిపోవడంతో అపార్థాలు పెరుగుతున్నాయి. గతంలో పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కరించే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అణు కుటుంబాలు పెరిగిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిన్న విభేదాలే విడాకుల వరకు తీసుకెళ్తున్నాయి. వీటితోపాటు సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. దంపతులు ఒకరికి ఒకరు సమయం కేటాయించకుండా, ఫోన్లో, యాప్‌లలో మునిగిపోవడం అనుబంధాలను బలహీనపరుస్తోంది. అనవసర పోలికలు, అనుమానాలు పెరిగి సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. సైకాలజిస్టులు చెబుతున్నట్లుగా సహనం తగ్గిపోవడం, ‘ఇంపల్స్ డిసిషన్స్’ (తక్షణ నిర్ణయాలు) పెరగడం వల్ల విడాకులు ఎక్కువ అవుతున్నాయి. వివాహం అనేది ఒక సమాయోజన ప్రయాణం. కానీ నేటి తరం "అనుకూలిస్తే బాగుంటుంది, లేకపోతే వదిలేయాలి" అనే ధోరణి వైపు వెళ్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ లో ఏటా నమోదు అవుతున్న విడాకుల కేసులు షాక్ గురిచేస్తున్నాయి. 2500300కేసులు నమోదు అవుతున్నాయి. పెళ్లైన ఏడాదిలోపే విడాకులు తీసుకుంటున్న జంటలు 60శాతం ఉంటే 25 నుంచి 35 ఏళ్ల వయస్సున్న జంటలే 75శాతం ఉన్నారు. 35ఏళ్లకు పైబడిన వారు 25శాతం ఉన్నారు. విడాకులకు సంబంధించి కోర్టుల ముందుకు ప్రతినెలా 250 కేసులు వస్తున్నాయి. 1015 జంటలు కౌన్సింగ్ ను ఆశ్రయిస్తున్నాయి. ప్రతినెలా సగటున ఒక్కో ఫ్యామిలీ కోర్టులో 30 కేసులు నమోదు అవుతున్నాయి.
హైదరాబాద్‌లో విడాకులు పెరుగుతుండటం ఒక సామాజిక సంకేతమని చెప్పవచ్చు. సంబంధాలు కేవలం ప్రేమతోనే కాదు, సహనం, గౌరవం, సమయం పంచుకోవడంపైనే నిలుస్తాయి. మూడు మూళ్లు, మూడు నాళ్ల ముచ్చటే కాకుండా, జీవితాంతం కలిసి సాగాలంటే ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం, ముఖ్యంగా సంభాషణ కొనసాగించడం చాలా అవసరమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.