
‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ తర్వాత తెలుగులో ఆ తరహా చిత్రాలకు గిరాకీ పెరిగింది. ఇపుడు ‘కౌసల్య తనయ రాఘవ’ కూడా అదే 80ల నాటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ రోజు థియేట్రికల్ విడుదలై ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఒకతను తన భార్యకు తన తాతకు సంబంధించిన కథను చెప్పడంతో ప్రారంభమవుతోంది. 80ల నాటి నేపథ్యంలో ఓ గ్రామంలో బడుగు వర్గానికి చెందిన కౌసల్య (సునీతా మనోహర్) కుమారుడు రాఘవ (రాజేష్ కొంచాడా) ఓ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. అదే గ్రామంలో ఉండే పెద్దింటి అమ్మాయి కావ్య (శ్రావణి శెట్టి) అదే కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. వీళ్లిద్దరు ప్రేమించుకుంటారు. కులాలు వేరే కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమకు అడ్డు చెబుతారు. మరోవైపు అదే కాలేజీలో రాఘవను వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ వీళ్ల ప్రేమను పెద్దలకు తెలియజేసేలా చేసి పంచాయితీ పెట్టి వారిద్దరు భవిష్యత్తులో కలుసుకోకుండా చేస్తారు. ఈ క్రమంలో కావ్యకు ఇంట్లో వాళ్లు ఓ సంబంధం చూస్తారు. కులాల అంతరంతో విడిపోయిన ఈ జంట తిరిగి ఒకటయ్యారా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు స్వామి పట్నాయక్ ఈ సినిమాను 80ల నేపథ్యం నాటి కథను తీసుకున్నారు. పెద్దింటి అమ్మాయి.. పేదింటి అబ్బాయి ఇద్దరు కాలేజీలో ప్రేమించుకోవడం వంటివి ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు ఈ సబ్జెక్ట్ ను హీరో అమ్మ క్యారెక్టర్ యాంగిల్ తీసుకొని తెరకెక్కించాడు. చిన్నపుడు తండ్రి చనిపోవడంతో అంతా తానై రాఘవను పెద్ద చేస్తోంది కౌసల్య. మరోవైపు తల్లి ఆశయం కోసం పెద్ద చదువులు చదువుతుంటాడు రాఘవ. చదువుతోనే పేదరికం పోతుందనే సందేశాన్ని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. మరోవైపు హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్ క్యూట్ గా ఉన్నాయి. కులాల అంతరంతో విడిపోయిన ప్రేమికులు.. చివరకు ఎలా కలిసారు. చివర్లో హీరో తల్లి ఆశయమైన చదువును పూర్తి చేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని దర్శకుడు చెప్పడం బాగుంది. చివర్లో ఊర్లో ప్రజలు కులా మతాలకు అతీతంగా ఉండాల్సిన వాళ్లు చిన్నా.. పెద్ద.. కులాల అంతరంతో ఎలా విడిపోతున్నారనే విషయాన్ని ఓ క్యారెక్టర్ తో చివర్లో చెప్పించడం బాగుంది. ఇక హీరో చివర్లో విలన్ తండ్రిని కాపాడి అతనిలో పరివర్తన తీసుకు రావడం వంటి అంశాలను దర్శకుడు బాగనే రాసుకున్నాడు. ముఖ్యంగా కొత్తవాళ్లతో మంచి నటనే రాబట్టుకొన్నాడు దర్వకుడు. ఇక సూటిగా చెప్పాల్సిన విషయాన్ని బాగా ల్యాగ్ చేసినట్టు ఉన్నారు. సినిమాను ఇంకా అరగంట తగ్గించినా.. పెద్దగా పోయేదేమి లేదు. మధ్యలో టైలర్ పాత్రలో రంగస్థలం మహేష్ తో సైజులు, కొలతలు వంటి బూతు కామెడీ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇక పారిజాతం అనే క్యారెక్టర్ తో చేయించిన వేషం సినిమాకు అనవసరమైన అంశాలనే చెప్పాలి. ఏదో మాస్ ఆడియన్స్ కోసం ఈ సన్నివేశాలను ఇరికించినట్టు ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పెద్దగా పనిచెప్పలేదనే విషయం తెలుస్తోంది.ముఖ్యంగా కులాల అంతరం కన్నా.. మనిషికి మానవత్వమే ముఖ్యమనే విషయాన్ని చెప్పాడు దర్శకుడు.
నటీనటుల విషయానికొస్తే..
రాజేష్ కుంచాడా విలేజ్ అబ్బాయి రాఘవ పాత్రకు న్యాయం చేసాడు. సినిమా చూస్తున్నంత సేపు క్యారెక్టర్ కనపడింది. నటుడిగా మంచి ఎక్స్ ప్రేషన్స్ పలికించాడు. హీరోయిన్ శ్రావణి శెట్టి క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఎక్కడా అతి లేదు. ఇక హీరో అమ్మ పాత్రలో నటించిన సునీతా మనోహర్ తన పాత్రలో జీవించింది. మరోవైపు బోస్ తాత, కాలేజీ విలన్ గ్యాంగ్ పాత్రలో నటించిన నటుడు సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. మానవత్వాన్ని చాటే ‘కౌసల్య తనయ రాఘవ’..
రేటింగ్ : 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe