ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం కాదని.. హోదా/ప్యాకేజీ పేరు ఏదైనా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీతో కలిసే అవకాశం లేదని.. సొంత దారిలోనే వెళ్తున్నామంటూ ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. థర్డ్ ఫ్రంట్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని...అయినా ఆయన పట్టించుకోలేదని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీతో తమకు రాజీ కుదిరే అవకాశం లేదని.. బీజేపీ పట్ల ఏపీ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని పవన్ చెప్పారు. ప్రధాని మోదీతో తనకు సాన్నిహిత్యం ఉందని.. నాకంటూ కొన్ని పరిమితులున్నాయని.. నేను ఎంపీని కాదన్నారు. బుందేల్‌ఖండ్ తరహాలో ఏపీలోని ఏడు జిల్లాలు దుర్భరంగా ఉన్నాయని.. ఈ జిల్లాల్లో పరిస్థితులు చక్కబడాలంటే కేంద్రం నుంచి అధిక నిధులు రావాల్సి ఉందన్నారు.
'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అన్నది పెద్ద విషయం కాదు. హోదా/ప్యాకేజీ పేరు ఏదైనా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడమే అవసరం. మా డిమాండ్లు నెరవేరనంత వరకూ మేము భాజపాతో కలిసే అవకాశం లేదు. ప్రస్తుతం మేము సొంత దారిలో వెళ్తున్నాం. ఎన్నికల సమయంలో థర్డ్ ఫ్రంటా? లేక సొంతంగా పోటీ చేయాలా అనేది నిర్ణయిస్తాం.’ అని చెప్పారు. ఇక ప్రభుత్వ పాలనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌కు 10కి ఎన్నిపాయింట్లు ఇస్తారని ప్రశ్నించగా.. చంద్రబాబుకు 2.5 మార్కులు, కేసీఆర్‌కు 6 మార్కులు వేస్తానంటూ బదులిచ్చారు.