చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు నగరాల్లో 'అమ్మ ఫ్రీ వైఫై' జోన్లను ప్రారంభించింది. ఈ పథకాన్ని 2016 సెప్టెంబరులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈ జోన్లలో బస్ టెర్మినల్స్, పార్కులు, వాణిజ్య సముదాయాలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో దివంగత నేత జయలలిత ఇచ్చిన హామీ మేరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుత అధికార ఏఐఏడీఎంకే ప్రభుత్వం. గురువారం ముఖ్యమంత్రి పళనిస్వామి సెక్రటేరియట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా'అమ్మ ఫ్రీ వైఫై' సేవలను ప్రారంభించగా, శుక్రవారం నుండి అవి అందుబాటులోకి వచ్చాయి.
'అమ్మ ఫ్రీ వైఫై' కేంద్రాల వద్ద ప్రతిరోజూ మొదటి 20 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ వాడుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత గంటకు రూ.10 చెల్లించాలి. ప్రస్తుతానికి చెన్నైలోని లేబర్ స్టాట్యూ, మెరీనా, చెన్నై, సెంట్రల్ బస్టాండ్, సేలం, తిరుచురాపల్లి, కోయంబత్తూరులోని గాంధీపురం బస్టాండ్, మదురైలోని మధుతువాని బస్టాండ్లలో మాత్రమే వీటిని ప్రారంభించారు.
ఈ అంశంపై ప్రభుత్వం ఆగస్టు 16, 2017న జీవో జారీ చేసింది. అందులో ప్రతిరోజూ 20 నిమిషాల ఉచిత ఇంటర్నెట్ సేవలను వాడుకొనే అవకాశం ఉందని, తరువాత గంటకు రూ.10 వసూలు చేయబడుతుందని పేర్కొంది. మొత్తం రూ.8.50 కోట్లతో తమిళనాడు అరుసు కేబుల్ టీవీ కార్పొరేషన్ (టిఎటిసివి) ఈ సదుపాయాన్ని అందించింది. మొదటి దశలో చెన్నై, తిరుచిరాపల్లి, సేలం, కోయంబత్తూరు, మదురైలలో ఈ సదుపాయం కల్పించబడుతుంది.
ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ ఎం.మణికందన్, ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, సమాచార సాంకేతిక విభాగం కార్యదర్శి డాక్టర్ బి. చంద్రమోహన్, టిఎటిసివి మేనేజింగ్ డైరెక్టర్ కుమారగూరుబరన్ పాల్గొన్నారు. 'అమ్మ ఫ్రీ వైఫై'తో పాటు జిల్లాలో వివిధ కళాశాలల్లో నిర్మించిన భవనాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు హౌసింగ్ బోర్డులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించబడిన 275 మంది వ్యక్తులకు సీఎం నియామక ఉత్తర్వులు పంపిణీ చేశారు.