తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం బెంగళూరులో జనతాదళ్ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో భేటీ అయ్యారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా వచ్చారు. కేసీఆర్ ప్రతిపాదించిన నూతన రాజకీయ కూటమి గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీ అనంతరం ఆయన జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో కూడా భేటీ కానున్నారు.
ఇటీవలి కాలంలో జనతాదళ్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన విధివిధానాలకు దగ్గరగా వ్యవహరిస్తున్న ఆ పార్టీతో కలసి నూతన కూటమిపై చర్చించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కర్ణాటక వచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే కేసీఆర్ ఇదే అంశంపై చర్చించేందుకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిశారు.అలాగే ఝూర్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడారు.
తాజాగా కర్ణాటకలో ఎన్నికల హడావుడి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉంటున్న జనతాదళ్ నేతలతో పాటు అపార అనుభవం కలిగిన దేవెగౌడతో కలిసి మాట్లాడాలని.. తద్వారా సరికొత్త రాజకీయ మార్పులకు నాంది పలికే విధంగా కేసీఆర్ యోచిస్తున్నారని పలువురి అభిప్రాయం. ఈ క్రమంలో ఆయన తన కర్ణాటక పర్యటనను గురించి దేవెగౌడకి ముందుగానే సమాచారం అందించారు.