Munugode Bypoll: కేటీఆర్, హరీష్ రావు గ్రాఫ్ తగ్గిందా? మునుగోడులో ఒక్కో మండలానికే ఇంచార్జ్ బాధ్యతలు..

Munugode Bypoll: కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. టీఆర్ఎస్ ఆవిర్బావం నుంచి కేసీఆర్ వెంట నడిచి అంతా తానై వ్యవహరించింది హరీష్ రావు. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత టాప్ లీడర్లు వీరిద్దరే

Written by - Srisailam | Last Updated : Sep 14, 2022, 01:16 PM IST
Munugode Bypoll: కేటీఆర్, హరీష్ రావు గ్రాఫ్ తగ్గిందా? మునుగోడులో ఒక్కో మండలానికే ఇంచార్జ్ బాధ్యతలు..

Munugode Bypoll: కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్. టీఆర్ఎస్ ఆవిర్బావం నుంచి కేసీఆర్ వెంట నడిచి అంతా తానై వ్యవహరించింది హరీష్ రావు. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత టాప్ లీడర్లు వీరిద్దరే. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పేరు. ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో కీలక పాత్ర పోషించారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా హరీష్ రావుకే బాధ్యత అప్పగించేవారు కేసీఆర్. బాస్ ఇచ్చిన టాస్క్ ను సక్సెస్ చేస్తూ ట్రబుల్ షూటర్ గా నిలిచేవారు హరీష్ రావు. అందుకే బైపోల్ బాధ్యతలను ఎక్కువగా హరీష్ రావే చూసేవారు.2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కొడంగల్ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. దీంతో సిద్దిపేట కంటే కొడంగల్ లోనే ఎక్కువ ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని ఓడించి సంచలన స్పష్టించారు హరీష్ రావు. కొడంగల్ విజయం తర్వాత హరీష్ రావు ఇంచార్జ్ గా ఉంటే.. అక్కడ కారు పార్టీ గెలుపు ఖాయమనే టాక్ వచ్చేసింది.

ఇక కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్ తో బంపర్ విక్టరీ కొట్టారు. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారంతో గులాబీ పార్టీకి ఏకంగా 99 సీట్లు వచ్చాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల బాధ్యతలను హరీష్ రావు, కేటీఆరే చూస్తు వచ్చారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు హరీష్ రావు చూశారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ బాధ్యతలు కేటీఆర్ చూశారు. అయితే ఇటీవల కాలంలో సీన్ మారిపోయింది. దుబ్బాక, హుజురాబాద్ లో హరీష్ రావు పూర్తి స్థాయి ఇంచార్జ్ గా ఉన్నా టీఆర్ఎస్ ఓడిపోయింది. తాజాగా హరీష్ రావు గ్రాఫ్ మరింతగా తగ్గిపోయిందని తెలుస్తోంది. అటు కేటీఆర్ ఇమేజ్ కూడా జనాల్లో తగ్గిపోయిందని అంటున్నారు. పీకే టీమ్ సర్వేల్లోనూ ఇదే తేలిందట. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కేటీఆర్, హరీష్ రావు గ్రాఫ్ తగ్గిపోయిందనే ప్రచారం నిజమనేలా ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. హుజురాబాద్ బైపోల్ ఓటమి టీఆర్ఎస్ కు షాకిచ్చింది. హుజురాబాద్ విజయం తర్వాత బీజేపీ దూకుడు మరింత పెరిగింది. ఆ పార్టీలోకి వలసలు జోరుగా సాగాయి. మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మారింది. మునుగోడులో ఏమాత్రం తేడా కొట్టినా.. దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. అందుకే అన్ని పార్టీలను మునుగోడు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్నాయి. గెలుపు కోసం పార్టీ బలగాలను మొత్తం అక్కడే మోహరిస్తోంది. అధికార పార్టీ కూడా గ్రామాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. మంత్రులను మండలాలకు ఇంచార్జులుగా నియమించింది. అయితే అనూహ్యంగా హరీష్ రావు, కేటీఆర్ కు కేవలం ఒక్క మండలం బాధ్యతే అప్పగించారు. కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్ మండలానికి కేటీఆర్, మర్రిగూడ మండలానికి హరీష్ రావును ఇంచార్జ్ గా నియమించారు. ఇక నాంపల్లి మండలానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలీటికి ఎర్రబెల్లి దయాకర్ రావు, మునుగోడుకు జగదీశ్ రెడ్డి, చౌటుప్పల్ శ్రీనివాస్ గౌడ్ , సంస్థాన్ నారాయణ పురం మండలానికి సత్యవతి రాథోడ్ ను ఇంచార్జులుగా నియమించారు. చండూరు మండల బాధ్యతలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు అప్పగించారు.

మునుగోడు ఉప ఎన్నికలో కేటీఆర్, హరీష్ రావును కేవలం ఒక్క మండలానికే ఇంచార్జ్ గా నియమించడం చర్చగా మారింది. గతంలో రాష్ట్ర ఎన్నికల బాధ్యతలు మొత్తం చూసిన నేతలను కేవలం ఒక్క మండలానికే పరిమితం చేయడంపై రకరకాల వాదనలు వస్తున్నాయి. జనాల్లో గ్రాఫ్ తగ్గడం వల్లే మండలానికి పరిమితం చేశారని అంటున్నారు. ఇక హరీష్ రావు, కేటీఆర్ కు ఇచ్చిన మండలాల సమీకరణల ఆధారంగానే ఉన్నాయి. గట్టుప్పల్ మండలంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం చేనేత శాఖ మంత్రిగా ఉన్నారు కేటీఆర్. దీంతో గట్టుప్పల్ మండల బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడే మరో అంశం ఉంది. గట్టుపల్ల్ చాలా చిన్న మండలం. కేవలం ఆరుగ్రామాలతో ఇటీవలే ఏర్పాటు చేశారు. కేవలం ఐదారు వేల ఓటర్లున్న మండలానికి కేటీఆర్ ను ఇంచార్జ్ గా నియమించడంపై పార్టీ కేడర్ లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఇక హరీష్ రావుకు అప్పగించిన మర్రిగూడం మండలంలో చర్లపర్లి రిజర్వాయర్ కడుతున్నారు. ఇక్కడ నిర్వాసితుల సమస్య తీవ్రంగా ఉంది. అందుకే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు మర్రిగూడం బాధ్యతలు అప్పగించారు.

గిరిజనులు ఎక్కువగా ఉన్న నారాయణ పురం మండలానికి సత్యవతి రాథోడ్ ను, గౌడ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న  చౌటుప్పల్ మండలానిక శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. నియోజకవర్గంలో యాదవులు ఎక్కువగా ఉండటంతో నాంపల్లి బాధ్యతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇచ్చారు. రెండు గ్రామాలకు కలిపి ఒక ఎమ్మెల్యేను అపాయింట్ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చిన్న మండలాన్ని అప్పగించడం.. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావును ఒక్క మండలానికే పరిమితం చేయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వాళ్లిద్దరి గ్రాఫ్ తగ్గడం వల్లే మండలానికి పరిమితం చేశారనే టాక్ వస్తోంది.

Read Also: Bhatti With KCR: అసెంబ్లీలో సీఎల్పీ నేతకు సీఎం ప్రశంసలు.. రేవంత్ రెడ్డిని తొక్కేయడమే కేసీఆర్ లక్ష్యమా?

Read Also: రాహుల్‌తో కలిసి పంత్‌ను ఓపెనర్‌గా పంపు.. రోహిత్‌కు మాజీ బ్యాటర్‌ సూచన! బ్యాటింగ్ ఆర్డర్‌ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News