Central Government employees DA hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు సమాచారం. 8వ పే కమిషన్ ఏర్పాటు విషయంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తీవ్ర అసహనంలో ఉన్న ఉద్యోగులను చల్లార్చేందుకు ప్రభుత్వం త్వరలోనే డీఏ పెంపు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/7కేంద్రంలోని మోదీ సర్కార్ మాంచి ఊపుమీదున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చాలా వరకు సామాన్యులకు మేలు చేసే విధంగా జీఎస్టీ సంస్కరణలను తీసుకువచ్చారు. డయాబెటిస్ రోగులతో పాటు క్యాన్సర్ రోగులకు కూడా మందుల ధరలను తగ్గించారు. రైతులు, కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి కూడా భారీ ఉపశమనం కల్పించారు. ముఖ్యంగా కొత్తగా కారు కొనాలనుకునేవారికి కూడా అదిరిపోయే శుభవార్త చెప్పారు.
2/7ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిగ్ అప్ డేట్ త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు ఆలస్యమవుతుండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ అసంతృప్తిని తగ్గించేందుకు కేంద్రం డియర్నెస్ అలవెన్స్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం DA 55శాతం వద్ద ఉండగా, రాబోయే జూలై-డిసెంబర్ 2025 కాలానికి ఇది 3శాతం పెరిగి 58శాతం వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
3/7కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా ప్రభావితం చేసింది. ఆ కాలంలో మూడు వాయిదాల DA/DR నిలిపివేయబడటంతో ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం ఇప్పటివరకు దీనిపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకోలేదు.
4/7ఇటీవల లోక్‌సభ సమావేశంలో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంగా చెప్పినట్లుగా, కరోనా సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించడానికే DA నిలిపివేసినట్లు తెలిపారు. అలాగే 18 నెలల బకాయిలు చెల్లించే ప్రణాళిక ప్రస్తుతం లేదని వెల్లడించారు. అయినప్పటికీ, కొత్తగా ప్రకటించబోయే పెంపు ఉద్యోగులకు కొంత ఊరట ఇస్తుందని భావిస్తున్నారు.
5/7ప్రతి సంవత్సరం కేంద్ర ఉద్యోగులు రెండు సార్లు DA పెంపు పొందుతారు. ఏడవ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం జనవరి-జూన్, జూలై-డిసెంబర్ ఇలా ఆరు నెలల వ్యవధిలో ఒకసారి పెంపు ప్రకటిస్తారు. ఈ ఏడాది తొలి విడతలో హోలీ పండుగ సమయానికి డీఏ పెరిగింది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మరోసారి పెంపు ప్రకటన చేసే అవకాశం ఉంది.
6/7డీఏ పెంపు శాతం ఎంతన్నది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, మూడు శాతం పెరుగుదల ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పండుగ బోనస్ తరహా ఆనందం దక్కే అవకాశం ఉంది. పెరిగే డీఏ వలన సాలరీలు, పెన్షన్లు మరింత పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో వారికి ఉపశమనం కలిగిస్తుంది.
7/7కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయంపై కన్నేసి ఉన్నారు. ఎనిమిదో పే కమిషన్ ఆలస్యం కారణంగా వచ్చిన అసంతృప్తి కొంతవరకు తగ్గాలంటే ఈ DA పెంపు కీలకంగా మారనుంది.