8th Pay Commission HRA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటుపైనే చర్చ జరుగుతోంది. కొత్త కమిషన్ సిఫార్సులు ఎలా ఉంటాయి..? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి..? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కొత్త పే స్కేళ్లు శాలరీ స్ట్రక్చర్‌ను మార్చడమే కాకుండా.. డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇంటి అద్దె అలవెన్స్ రేట్ల (HRA)పై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
8వ వేతన సంఘంలో HRA రేట్లలో మార్పు ఉంటుందా ..? లేదా..? అని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి పే కమిషన్‌తో HRA శ్లాబులను కూడా సవరిస్తారు. 6వ పే కమిషన్‌లో HRA రేట్లు 30%, 20%, 10% గా ఉన్నాయి. 7వ పే కమిషన్ ఈ రేట్లను సవరించింది. 24%, 16%, 8% గా నిర్ణయించింది. అయితే డీఏ 50 శాతానికి చేరుకోవడంతో చేరుకోవడంతో HRA మళ్లీ 30%, 20%, 10% గా పెరిగింది.
త్వరలో కొత్త ఏర్పడనున్న కొత్త పే కమిషన్ మరోసారి ప్రాథమిక వేతనం, డీఏ నిర్మాణం ప్రకారం HRA రేట్లను సమీక్షిస్తుంది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92గా నిర్ణయించవచ్చని నిపుణులు అంటున్నారు. అంటే ఉద్యోగి ప్రస్తుత మూల వేతనాన్ని 1.92తో గుణించడం ద్వారా కొత్త మూల వేతనాన్ని నిర్ణయిస్తారు.
ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రస్తుత బేసిక్ శాలరీ రూ.30 వేలు అయితే.. కొత్త జీతం రూ.30,000×1.92= రూ.57,600 అవుతుంది. HRA లెక్కింపు కూడా కొత్త బేసిక్ పే ఆధారంగా ఉంటుంది.
కొత్త వేతన సంఘంలో HRA రేట్లలో మార్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగులకు ఇన్‌హ్యాండ్ శాలరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేట్లను సవరించి డీఏతో అనుసంధానం చేస్తారని చెబుతున్నారు. డీఏ 25 శాతం, 50 శాతానికి చేరుకున్నప్పుడు సవరణ చేయాలనే నిబంధన ఉంది.