8th Pay Commission SBI Clerk Salary: భారతదేశంలో ప్రభుత్వ..పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన 8వ వేతన కమిషన్ (8th Pay Commission) త్వరలో రానుంది. ఈ కమిషన్ ద్వారా దేశంలోని అనేక ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల చోటు చేసుకోనుంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగులకు ఇది మంచి వార్తగా మారింది.
తాజా రిపోర్టుల ప్రకారం.. కొత్త ఎనిమిదవ.. వేతన కమిషన్ ద్వారా ఎస్‌బీఐ క్లర్క్ ఉద్యోగుల ప్రాధమిక జీతం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ పే రూ.26,730గా ఉంది. కానీ 8వ వేతన కమిషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రూ.30,000కు పైగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ పెరుగుదల కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి మంచి ప్రోత్సాహం కలిగిస్తుంది.
మధ్యస్థ స్థాయి ఉద్యోగుల విషయానికొస్తే, వారి ప్రాధమిక జీతం రూ.75,000 వరకు పెరగనుందని.. అంచనా. ఇది అనుభవం ఉన్న ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపరచటానికి తోడ్పడుతుంది. దీని వలన.. ఎస్‌బీఐలో దీర్ఘకాలికంగా పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక భద్రత పెరుగుతుంది.
ఇటీవల ఎస్‌బీఐ 2025 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 6,589 పోస్టులు.. ఉన్నాయని వెల్లడించింది. ఈ వార్తతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా 8వ వేతన కమిషన్ వల్ల వచ్చే జీత పెరుగుదలపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం ఎస్‌బీఐ క్లర్క్‌ల వేతన నిర్మాణం ఇలా ఉంది: బేసిక్ పే రూ.26,730. దీనికి వివిధ అలవెన్సులు కలిపి మొత్తం గ్రాస్ జీతం రూ.45,888 అవుతుంది. డిడక్షన్లు తీసిన తర్వాత చేతికి వచ్చే నికర జీతం సుమారు రూ.39,529గా ఉంటుంది.
ఎస్‌బీఐ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ వంటి అనేక ప్రయోజనాలు అందుతాయి. ఉదాహరణకు, డియర్‌నెస్ అలవెన్స్ రూ.7,161, హౌస్ రెంట్ అలవెన్స్ రూ.2,862 (పోస్టింగ్ ప్రదేశాన్ని బట్టి మారుతుంది), స్పెషల్ అలవెన్స్ రూ.7,083 వరకు ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉద్యోగుల మొత్తం జీతాన్ని గణనీయంగా పెంచుతాయి.
జీతం నగరాన్నిబట్టి కూడా మారుతుంది. మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ హౌస్ రెంట్ అలవెన్స్ లభిస్తుంది. అయితే చిన్న పట్టణాలు లేదా గ్రామాల్లో పనిచేసేవారికి తక్కువ HRA ఉన్నా.. అక్కడ జీవన వ్యయం తక్కువగా ఉండటంతో వారి ఖర్చులు సులభంగా మేనేజ్ చేయవచ్చు. ఎస్‌బీఐలో ఉద్యోగుల జీతం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ప్రారంభ బేసిక్ రూ.26,730 నుంచి రూ.64,480 వరకు పదోన్నతులతో పాటు వృద్ధి చెందుతుంది. ఈ విధమైన పద్ధతి ఉద్యోగులకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పిస్తుంది.