Tollywood Actress Comeback
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి..14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..ఎవరితో రీ ఎంట్రీ ఇవనుందో అనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న.. రంభ మరోసారి వెండితెరపై కనిపించనుంది. 90వ దశకంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి అగ్రహీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. కేవలం 15 ఏళ్లకే కథానాయికగా మారి, తెలుగు సహా తమిళం, మలయాళం భాషల్లోనూ దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది.
రంభ టాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, కేవలం తన అందచందాలు మాత్రమే కాదు, నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘అళగియ లైలా’ పాటతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
కెరీర్ బరిలో దూసుకెళ్తున్న సమయంలోనే రంభ 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకుంది. తర్వాత సినీరంగానికి దూరంగా ఉంటూ కుటుంబ జీవితాన్ని ఎంచుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఇన్నేళ్ల విరామం తర్వాత రంభ మళ్లీ వెండితెరపై కనిపించబోతోందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. గతంలో ఆమె పలు టీవీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించగా, ఇప్పుడు నటిగా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందట. ఏకంగా ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది అని వినికిడి.
సినిమాల నుంచి విరమించుకున్నా, రంభ వ్యాపార రంగంలోను సక్సెస్ సాధించింది. నివేదికల ప్రకారం, ఆమె ఆస్తులు దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. టాలీవుడ్‌లో చాలా మంది సీనియర్ హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చినట్టు, రంభ కూడా అదే బాటలో అడుగులు వేస్తుంది. ఇప్పటికీ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ఈ రీఎంట్రీపై భారీ అంచనాలున్నాయి. ఆమె ఏ తరహా సినిమాల్లో నటించబోతుందనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.