India vs South Africa : ధర్మశాలలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచులో టీమిండియా బంపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో ఆతిథ్య భారత జట్టు 7వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బౌలర్ల మ్యాజిక్, అభిషేక్ శర్మ మెరుపు దాడితో టీమిండియా ఈజీగా గెలుపును సొంతం చేసుకుంది.
తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచులో అభిషేక్ శర్మ రఫ్పాడించాడు. భారత ఇన్నింగ్స్ ను తొలి బంతికే సిక్స్ తో షురూ చేశాడు. ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ సన్ రైజర్స్ కుర్రాడు. ఈ మ్యాచుతోపాటు 2025 ఏడాది మొత్తం అభిషేక్ శర్మ కెరీర్ లోనే మరిచిపోలేని ఏడాదిగా మలుచుకున్నాడు. వరుస రికార్డులు, దూకుడు ఓపెనింగ్స్, స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంతో టీ20 ఫార్మట్లో తనదైన ముద్ర వేసుకున్నాడు అభిషేక్.
ఆదివారం ధర్మశాలలోని హెచ్ పీసీఏ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో లుంగీ ఎన్గిడి వేసిన భారత ఇన్నింగ్స్ తొలి బంతినే అభిషేక్ సిక్స్ గా మలిచాడు. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మూడుసార్లు సిక్స్ కొట్టి.. ప్రపంచంలో తొలి బ్యాట్స్‌మన్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒక ఏడాదిలోనే మూడుసార్లు ఈ రికార్డ్ నమోదు చేయడం విశేషం. సెప్టెంబర్ 10న దుబాయ్‌లో జరిగిన ఇండియా–యూఏఈ ఆసియా కప్ మ్యాచ్‌లో తొలిసారి ఈవిధంగానే ప్రారంభించిన అభిషేక్, సెప్టెంబర్ 21న ఇండియా–పాకిస్తాన్ ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది తొలి బంతికి సిక్స్ కొట్టాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే తరహాలో ఆడి మరో రికార్డును క్రియేట్ చేశాడు.
కాగా భారత క్రికెట్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టిన మొదటి ఆటగాడి రికార్డ్ రోహిత్ శర్మపై ఉంది. 2021 మార్చిలో ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డ్ సాధించాడు. ఆ తర్వాత 2024 జూలైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో చేరాడు. 2025 ఫిబ్రవరి 2న సంజు సామ్సన్ ఇదే రికార్డు నమోదు చేశాడు. అయితే ఈ జాబితాలో అభిషేక్ ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే అతను ఈ రికార్డును ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు సాధించాడు. మిగిలినవారందరిపై ఒక్కోసారి మాత్రమే చేసిన రికార్డు ఉంది.
2025లో ఇప్పటివరకు ఆడిన 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ 1,569 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20ల్లో 46 పరుగులు చేస్తే, ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును అతను అధిగమించనున్నాడు. 2016లో కోహ్లీ మొత్తం 1,614 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ స్థాయిలో చూస్తే.. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు నికోలస్ పూరన్ పేరిట ఉంది. 2024లో అతను 76 మ్యాచ్‌ల్లో 2,331 పరుగులు చేశాడు. ఆ రికార్డును ఇప్పటికిప్పుడు బద్దలు కొట్టడం కష్టమైనప్పటికీ, అభిషేక్ ప్రస్తుత ఫామ్ చూస్తే భవిష్యత్తులో అది కూడా సాధ్యమే అనిపించక తప్పదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిల బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను 117 పరుగులకే కట్టడి చేసింది భారత్. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 61 పరుగులతో పోరాడినా.. మిగతా బ్యాట్స్‌మన్‌లు నిలదొక్కుకోలేదు. తర్వాతి లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులతో దుమ్ములేపాడు. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి 32 బంతుల్లో 60 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చింది. గిల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఫోర్లు బాదుతూ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు.
కాగా అభిషేక్ ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, పలు ఫోర్లు ఉండగా.. ఐదు ఓవర్లలోనే భారత్ 60 పరుగులు సాధించడంలో అతని పాత్ర కీలకమని చెప్పాలి. చివరికి కార్బిన్ బోష్ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్‌తో అతని ఇన్నింగ్స్ ముగిసినా, అప్పటికే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసింది. తిలక్ వర్మ వేగంగా పరుగులు చేసి మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో భారత్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌తో మరోసారి భారత టీ20 భవిష్యత్తుకు బంగారు బాతు అని నిరూపించుకున్నాడు.